కార్యకర్తల త్యాగాలకు విలువ ఎక్కడ?
వర్ధన్నపేట 14వ డివిజన్ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు
డివిజన్ అధ్యక్షుడు ఇంతియాజ్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన సొంత పార్టీ కార్యకర్తలు
పాత–కొత్త నాయకత్వాల మధ్య పెరుగుతున్న మౌన సంఘర్షణ
పోలీసులతో వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆవేదన
ఎమ్మెల్యే నాగరాజు ముందు కఠిన పరీక్ష
కాకతీయ, వరంగల్ బ్యూరో : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత “పార్టీ కోసం ప్రాణాలు పెట్టిన కార్యకర్తలే మా బలం” అన్న నినాదం తరచూ వినిపిస్తోంది. కానీ వర్ధన్నపేట నియోజకవర్గం 14వ డివిజన్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ మాటలకు విరుద్ధంగా ఉన్నాయా? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంతియాజ్ చుట్టూ నెలకొన్న వివాదాలు ఇప్పుడు వ్యక్తిగత విమర్శల స్థాయిని దాటి, పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికే సవాల్‌గా మారుతున్నాయి. ‘ఇంతియాజ్ డౌన్‌డౌన్’ అంటూ సొంత పార్టీ కార్యకర్తలే బహిరంగ నిరసనకు దిగడం కాంగ్రెస్‌లో పెరుగుతున్న అసంతృప్తికి స్పష్టమైన సంకేతంగా మారింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఇంతియాజ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, పార్టీ ఆది నుంచీ పని చేసిన కార్యకర్తలను పక్కన పెట్టారని వస్తున్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఇవి కాంగ్రెస్‌లోని “పాత–కొత్త” నాయకత్వాల మధ్య కొనసాగుతున్న మౌన పోరును బయటపెడుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో గడపగడప తిరిగిన కార్యకర్తలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడంపై పార్టీ అధిష్టానం స్పందించాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ వినిపిస్తోంది.
బ్యానర్ నుంచి స్టేషన్ వరకు…
క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో తన ఫోటో లేదన్న కారణంతో పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారన్న డివిజన్ అధ్యక్షుడిపై స్థానిక నాయకులు ఆరోపణలు చేయడం గమనార్హం. బ్యానర్‌లో ఫోటో ఉండటమే నాయకత్వానికి కొలమానమా? లేక ప్రజల్లో సేవల ద్వారా సంపాదించిన నమ్మకమే అసలైన బలమా? అని ప్రశ్నిస్తున్నారు. వరదల సమయంలో ప్రజలకు అండగా నిలిచిన జానీకి పెరిగిన ప్రజాదరణే ఈ వివాదానికి మూలమా? అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతియాజ్ ‘షాడో ఇన్స్పెక్టర్’లా వ్యవహరిస్తున్నాడన్న విమర్శలు కొత్తవి కాకపోయినా, మరోసారి పోలీస్ వ్యవస్థ రాజకీయ విమర్శల కేంద్రంగా మారడం ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చట్టం అందరికీ సమానమేనన్న సూత్రం అధికార పార్టీ నాయకుల విషయంలో భిన్నంగా అమలవుతోందా? అన్న సందేహాలు ప్రజల్లో బలపడుతున్నాయి.
ఎమ్మెల్యే నాగరాజు ముందు అసలు పరీక్ష
ఈ వ్యవహారం ఇప్పుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ముందు కీలక పరీక్షగా మారింది. పార్టీ కోసం ఆది నుంచీ పనిచేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తారా? లేక అధికారానికి దగ్గరగా ఉన్న నాయకులకే పెద్దపీట వేస్తారా? అన్న చర్చ డివిజన్‌లో జరుగుతోంది. ఈ నిర్ణయం ఒక్క డివిజన్‌కే కాకుండా నియోజకవర్గంలో కాంగ్రెస్ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ చరిత్రలో కార్యకర్తే పార్టీకి వెన్నెముక. ఆ వెన్నెముకను విస్మరిస్తే అధికార బలం ఎంత ఉన్నా పార్టీ పునాదులు కదిలిపోతాయంటూ నాయకులు గుర్తు చేస్తుండటం గమనార్హం.


