మేడారం జాతరకు సెలవు ఎక్కడ..?
గిరిజన ఆత్మగౌరవంపై ప్రభుత్వ నిర్లక్ష్యం
తక్షణమే అధికారిక సెలవు ప్రకటించాలి: బీజేపీ ఎస్టీ మోర్చా
కాకతీయ, హైదరాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన మహాజాతరగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క–సారక్క జాతరకు ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించకపోవడం గిరిజన సమాజంపై జరిగిన ఘోరమైన అవమానం, అన్యాయం అని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రవి నాయక్ నేనావత్ తీవ్రంగా మండిపడ్డారు. మేడారం జాతర గిరిజనుల ఆత్మ, ఆరాధన, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని గుర్తు చేస్తూ, అలాంటి పవిత్రమైన మహాజాతరను విస్మరించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కోట్లాది మంది గిరిజనుల ఆరాధ్యదైవాలైన సమ్మక్క–సారక్కల మహాజాతరకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారని, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఈ జాతరకు సెలవు ఇవ్వకపోవడం గిరిజనుల ఆత్మగౌరవాన్ని తుంగలో తొక్కడమేనని విమర్శించారు. ఇతర మతపరమైన ఉత్సవాలకు సెలవులు ప్రకటించే ప్రభుత్వం, మేడారం జాతర విషయంలో మాత్రం కావాలనే వివక్ష చూపుతోందని ఆరోపించారు.
గిరిజన సంస్కృతిపై వివక్ష
మేడారం జాతరకు సెలవు ప్రకటించకపోవడం గిరిజన సమాజాన్ని రెండో తరగతి పౌరులుగా చూస్తున్నట్లేనని రవి నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం పరిపాలనా నిర్లక్ష్యం కాదని, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాల పట్ల ప్రభుత్వానికి ఉన్న అసహనం, ద్వేషభావాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. వనదేవతల మహిమను, గిరిజనుల విశ్వాసాన్ని గౌరవించాల్సిన ప్రభుత్వం రాజకీయ లెక్కలతో మేడారం జాతరను విస్మరించడం సిగ్గుచేటన్నారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు రాష్ట్రానికి గర్వకారణమని చెప్పుకునే పాలకులు, ఆచరణలో మాత్రం పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మేడారం జాతరకు సెలవు ఇవ్వడం ద్వారా గిరిజనుల విశ్వాసానికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని మేడారం సమ్మక్క–సారక్క మహాజాతరకు అధికారిక సెలవు ప్రకటించాలని బీజేపీ ఎస్టీ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నామని రవి నాయక్ నేనావత్ స్పష్టం చేశారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడాలంటే, వారి విశ్వాసాలు, సంప్రదాయాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మేడారం జాతరకు సెలవు ప్రకటించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు.


