దేవ్‌జీ ఎక్కడ?
అజ్ఙాతంలోనా? పోలీసుల అదుపులోనా?
సీపీఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి ఆచూకీపై ఆందోళన
వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో కలవరం
హిడ్మా మరణం తర్వాత అందరి దృష్టి తిరుపతిపైనే..
మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ మృతుల్లో ఉన్నాడని పుకార్లు
పోలీస్ కస్టడీలోనే ఉండొచ్చని అనుమానాలు
తమ ఆదీనంలో లేడంటున్న పోలీసులు
కోర్టులో హాజరుపర్చాలంటున్న కుటుంబసభ్యులు
హానీ తలపెట్టొద్దంటూ వామపక్ష, విప్లవ సానుభూతిపరుల డిమాండ్
ఆయుధాలు తయారీలో తిరుపతికి ప్రావీణ్యం
ఆయన తలపై ఎన్‌ఐఏ రూ.కోటి రివార్డు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : వరుసగా అగ్రనేతల ఎన్‌కౌంటర్లు.. లొంగుబాట్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టు పార్టీకి హిడ్మా మరణంతో కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. ఒకరకంగా హిడ్మా ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు ఉద్యమం ఇక చివరి దశకు చేరుకుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అంతలా ప్రభావితం చేసే వ్యక్తిని కోల్పోయిన తర్వాత పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఈక్రమంలోనే ఇప్పుడు అందరి దృష్టి సీపీఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీపై పడింది. దేవ్‌జీ భద్రత, ఆచూకీపై ఆందోళన వ్యక్తం అవుతోంది. హిడ్మా ఎన్‌కౌంటర్ జరిగిన మరుసటి రోజు బుధవారం మారేడుమిల్లి అడవుల్లో మరో ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు చినిపోయారు. అందులో దేవ్‌జీ ఉన్నారని పుకార్లు రాగా.. ఏడీజీ (ఇంటెలిజెన్స్) మహేష్ కుమార్ లడ్డా ఖండించారు. ఎన్‌కౌంటర్ మృతుల్లో ఆయన లేరని స్పష్టంచేయడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. దేవ్‌జీ ప్రస్తుతం కస్టడీలోనే ఉండవచ్చని కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కస్టడీలో ఉంటే వెంటనే న్యాయస్థానంలో హాజరుపర్చాలని వామపక్ష పార్టీలతోపాటు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తిరుపతిపై ఎన్‌ఐఏ రూ.కోటి రివార్డు ప్రకటించినట్లు సమాచారం.
మూడంచెల భద్రత
మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వానికి మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందని చెప్తున్నారు. కానీ పరిస్థితులు మారుతున్న తరుణంలో సెక్యూరిటీ అంత పెద్ద మెుత్తంలో లేదు. కానీ మావోయిస్టు చీఫ్ వెంట ఎల్లప్పుడూ భద్రతా బృందం ఉంటుంది. అగ్రనాయకత్వాన్ని కచ్చితంగా కాపాడుకునేందుకే మావోయిస్టులు మెుదటి ప్రాధాన్యత ఇస్తారు. అయితే తాజాగా మావోయిస్ట్ ఛీఫ్ దేవ్‌జీ సెక్యూరిటీ టీమ్‌లో 9 మందిని ఏపీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో దేవ్‌జీ ఎక్కడ ? అనే ప్రశ్న ఎక్కువైంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా.. మావోయిస్ట్ చీఫ్‌ను సెక్యూరిటీ అస్సలు వదిలిపెట్టదని చెబుతున్నారు. ఆయన ఇంకో దగ్గర ఉంటే, సెక్యూరిటీ షెల్టర్‌లో ఏం చేస్తారని ప్రశ్నలు వస్తున్నాయి. షెల్టర్‌లో ఉన్న అగ్రనాయకులను కూడా అడవుల్లోకి పట్టుకెళ్తున్నారని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దేవ్‌జీ పోలీసుల అదుపులో ఉన్నారని, అతడిని అరెస్టును ప్రకటించాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. అగ్రనాయకత్వాన్ని తుడిచేస్తే మళ్లీ విప్లవం గురించి ఆలోచించేందుకు సానుభూతిపరులు కూడా భయపడుతారని, అందుకే పోలీసులు ప్లాన్ చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నాయి. హిడ్మాను కూడా షెల్టర్ నుంచి మారేడుమిల్లి అడవుల్లోకి తీసుకొచ్చి చంపేశారని కొందరు అంటున్నారు.
బూటకపు ఎన్‌కౌంటర్లు
దేవ్‌జీ సురక్షితంగా ఉన్నారనే విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు, మావోయిస్టు సానుభూతిపరులు దాదాపు నమ్మడంలేదు. పోలీసులు చెప్పే విషయాలను ఖండిస్తున్నారు. మావోయిస్ట్ చీఫ్ పోలీసు కస్టడీలో ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు దేవ్‌జీ సోదరుడు తిప్పిరి గంగాధర్ జగిత్యాల జిల్లాలోని తమ స్వస్థలమైన కోరుట్లలో మీడియాతో మాట్లాడారు. ఏపీ పోలీసులు తిరుపతిని అరెస్టు చేసి ఉంటే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలతో లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నా.. అగ్రనాయకత్వాన్ని బూటకపు ఎన్‌కౌంటర్ చేస్తున్నారని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. హిడ్మా కూడా సాయుధ పోరాట విరమణ గురించి ఆలోచిస్తు్న్నట్టుగా ఛత్తీస్‌గఢ్ జర్నలిస్టుకు రాసిన లేఖ గురించి చర్చ జరుగుతోంది. అయితే అంతకుముందు కొన్ని విషయాలపై చర్చించాలని హిడ్మా అన్నారని చెబుతున్నారు. లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నా.. కావాలనే టాప్ లీడర్లను చంపేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కోరుట్ల నుంచి అజ్ఞాతంలోకి..
తిప్పిరి తిరుపతి కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందినవారు. ఆయన తల్లిదండ్రులు గంగుబాయి, వెంకట నర్సయ్య. వారికి ముగ్గురు కుమారులు, కుమార్తె ఉండగా తిరుపతి పెద్ద కుమారుడు. పాఠశాల, ఇంటర్ విద్యను తిరుపతి కోరుట్లలో పూర్తి చేశారు. 1978 సెప్టెంబరు 9న జగిత్యాలలో కొండపల్లి సీతారామయ్య వర్గం ‘జగిత్యాల జైత్రయాత్ర’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభ తిరుపతిని విప్లవ రాజకీయాలవైపు మళ్లించినట్లు చెబుతారు. ఈ సభకు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన రైతులు, కూలీలు, ప్రజలు పెద్దఎత్తున హాజరయ్యారు. గణపతి, కిషన్‌జీ, శీలం నరేశ్, కైరి గంగారాం, గజ్జెల గంగారాం, ఓదెలు, గద్దర్ తదితరులు పాల్గొని ప్రజలను ఉత్తేజ పరిచారు. ఈ సభకు హాజరైన తిరుపతి అనంతరకాలంలో, 1983లో రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్‌ఎ్‌సయూ)లో చేరారు. కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో నిర్బంధం పెరగడంతో 1984లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
అచెలంచెలుగా..
పెద్దపల్లి, గోదావరిఖని, జగిత్యాల, వరంగల్, హన్మకొండ తదితర ప్రాంతాల్లో దళ నాయకుడిగా, కార్యదర్శిగా, కమిటీ సభ్యుడిగా తిరుపతి పనిచేశారు. బీదర్, ఛత్తీ్‌సగఢ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ ఆయుధ కర్మాగార బాధ్యుడిగా ఆయన విధులు నిర్వహించినట్లు సమాచారం. ఆయుధాలు తయారు చేయడంలో తిరుపతికి ప్రావీణ్యం ఉందని చెబుతారు. పార్టీకి కార్యకర్తలను సమీకరించటం, వారికి శిక్షణ ఇవ్వటంలోనూ ఆయనది కీలకపాత్ర. మావోయిస్టు పార్టీలో తిరుపతి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయనను ఆంధ్ర, తెలంగాణలో తిరుపతి అని పిలుస్తుండగా ఛత్తీ్‌సగఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో దేవ్‌జీగా పిలుస్తారు. నల్లగొండకు చెందిన సృజనను తిరుపతి వివాహం చేసుకున్నారన్న ప్రచారం ఉంది. ఆపరేషన్ కగార్, వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో తిరుపతి ఆచూకీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తిరుపతి ప్రస్తుతం సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్‌గా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2003లో అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన దాడిలో నంబాల కేశవరావుతోపాటు తిరుపతి పాత్ర ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 2010లో దంతెవాడ సమీపంలో 74 మంది సెంట్రల్ రిజర్వ్ జవాన్లను పొట్టనపెట్టుకున్న నక్సల్స్ దాడికి తిరుపతి సారథ్యం వహించినట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. తిరుపతిపై ఎన్‌ఐఏ రూ.కోటి రివార్డు ప్రకటించినట్లు సమాచారం.


