పరిహారం ఎప్పుడిస్తారు..? స్పష్టత ఇవ్వండి!
సిగాచి బాధితులపై ప్రభుత్వ వైఖరికి హైకోర్టు ఆగ్రహం
ఎంత ఇస్తామన్నారో.. ఎంత ఇచ్చారో చెప్పాలంటూ ప్రశ్నలు
సిట్ పరిహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశం
కాకతీయ, హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీ ప్రమాద బాధితుల పరిహారంపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ హైకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. పరిహారం విషయంలో స్పష్టత లేదంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. “ఎంత పరిహారం ఇస్తామని చెప్పారు? ఇప్పటివరకు ఎంత ఇచ్చారు? మిగతా మొత్తాన్ని ఎప్పుడు ఇస్తారు?” అంటూ న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సిగాచి ఫార్మా ప్రమాదంలో మృతి చెందిన 56 మంది, ఆచూకీ లభించని 8 మంది, 28 మంది క్షతగాత్రులకు న్యాయం చేయాలని కోరుతూ బాబురావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాధితులకు తగిన పరిహారం చెల్లించడంతో పాటు, ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని ఆయన కోర్టును కోరారు.
ప్రభుత్వంపై న్యాయమూర్తి మండిపాటు
ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి పరిహారం పంపిణీ విషయంలో ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలు ఇంకా నిరీక్షణలో ఉండగా, స్పష్టమైన షెడ్యూల్ లేకపోవడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. పరిహార ప్రకటనలు మాత్రమే సరిపోవని, అమలు ఎలా జరుగుతోందో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరిహారం పంపిణీకి సంబంధించిన అంశాలపై సిగాచి ఫార్మా కంపెనీ స్పష్టమైన వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కంపెనీ ప్రకటించిన పరిహారంతో పాటు, చట్టప్రకారం బాధితులకు అందాల్సిన పరిహారం ఎంత అనే వివరాలను కూడా కోర్టుకు సమర్పించాలని తెలిపింది. ఈ అంశంపై పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
కీలక శాఖలకు నోటీసులు
ఈ కేసులో అపరేష్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ హైదరాబాద్ రీజినల్ కమిషనర్, ఈఎస్ఐ డైరెక్టర్, రాష్ట్ర ఔషధ నియంత్రణ మండళ్లను సుమోటో ప్రతివాదులుగా చేర్చి నోటీసులు జారీ చేసింది. పరిహారానికి సంబంధించిన చట్టపరమైన బాధ్యతలు ఎలా నిర్వర్తించారో వివరించాలని ఆదేశించింది. ప్రమాదం జరిగి చాలా కాలం గడిచినా పరిహారం విషయంలో స్పష్టత లేకపోవడం బాధిత కుటుంబాల్లో ఆందోళనను పెంచుతోంది. హైకోర్టు తాజా ఆదేశాలతో అయినా ప్రభుత్వం, కంపెనీ బాధ్యతగా స్పందించి బాధితులకు న్యాయం చేస్తాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. కోర్టు తదుపరి విచారణలో ప్రభుత్వ వివరణపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.


