అరుంధతి కల్యాణ మండపం ప్రారంభమెప్పుడు..?!
నాలుగేళ్లుగా ఆరంభానికి నోచుకోని భవనం
ప్రకటనలకే పరిమితమైందా సంక్షేమ వాగ్దానం..!!
కాకతీయ, శంకరపట్నం : మండల కేంద్రంలో నిర్మించిన అరుంధతి కళ్యాణ మండపం ప్రారంభం ఇంకా ఆలస్యమవుతుండటంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పోలీస్ స్టేషన్ వెనుక సర్వే నంబర్ 500లో తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలలో భాగంగా ఈ భవనానికి అప్పటి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శంకుస్థాపన చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి ఈ మండపం ఉపయోగపడుతుందని ప్రకటించినప్పటికీ, నిర్మాణం పూర్తై నాలుగేళ్లు గడిచినా ప్రారంభానికి నోచుకోకపోవడం గమనార్హం. పేరుకే మండల కేంద్రం అయినా అభివృద్ధి విషయంలో వెనుకబడిన పరిస్థితి ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. భవనం సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రారంభం ఆలస్యమవ్వడం వెనుక కారణాలేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రకటనలకే పరిమితమవుతున్న అభివృద్ధి పనులు, కార్యరూపం దాల్చకపోవడం బాధాకరమని అంటున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, అధికారులు చొరవ తీసుకుని అరుంధతి కళ్యాణ మండపాన్ని ప్రారంభించి పేద ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.



