- ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలి
- టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి
కాకతీయ, రాయపర్తి : రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి దిగమింగుకోలేక సోషల్ మీడియా వేదికగా కొంతమంది చేస్తున్న అసత్య ప్రచారాలను అస్సలు నమ్మొద్దని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మండల స్థాయి సోషల్ మీడియా సమీక్ష సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు అనుసరించవలసిన వ్యూహాల పై దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక కొంతమంది దుర్మార్గులు ప్రజలను తప్పుదోవ పట్టించడానికే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె దుయ్యబడ్డారు.
ఇలాంటి ప్రచారాలు చేసేవారిని, సహకరించే వారిని సహించబోమని హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు తప్పకుండ వివరించాలన్నారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే మొదటి లక్ష్యమని అభివర్ణించారు. ప్రతీ ఒక్కరు స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా దృఢ సంకల్పంతో పని చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిజమైన లబ్దిదారులకే సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. ఎన్నికలు ఏవైనా గెలుపు కాంగ్రెస్ పార్టీదే అని ధీమా వ్వక్తం చేశారు. కార్యక్రమంలో తొర్రూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హామ్యా నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ బండి రాజేంద్రప్రసాద్, టౌన్ కోఆర్డినేటర్ ఉబ్బని నవీన్, గుగులోత్ వెంకన్న, వివిధ గ్రామాల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.


