రియల్ వ్యాపారి ఆగడాలు.. అధికారి అండదండలు
చేసేది అక్రమ దందా..ప్రశ్నిస్తే బెదిరింపులు..!
అనుమతులున్నాయని బెదిరింపులు
ధర్మసాగర్ మండలంలో రియల్ వ్యాపారి లీలలు
పదకొండు ఎకరాల్లో అక్రమ వెంచర్
అందులోనూ ఎకరం భూమి వివాదంలోనే
యథేచ్చగా ప్లాట్ల క్రయ విక్రయాలు
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
అమాయక ప్రజలను బురిడీకొట్టిస్తున్న యజమాని
అక్రమ దందాకు రెవెన్యూ అధికారి సహకారం !
కాకతీయ వరుస కథనాలతో కలకలం
వెంచర్ యజమానికి నోటీసులు జారీచేసిన కుడా
ఐదు రోజుల్లో అనుమతి పొందాలని ఆదేశం
వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్
నాన్ లేఔట్ వెంచర్‌పై కాకతీయ ప్రతినిధికి ఫిర్యాదులు

కాకతీయ, వరంగల్ బ్యూరో : హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఎల్కుర్తిలోని అక్రమ వెంచర్ బాగోతంపై కాకతీయ పత్రికలో ప్రచురితమవుతున్న వరుస కథనాలు జిల్లాలో సంచలనంగా మారాయి. ఇటు కుడా.. అటు రెవెన్యూ అధికారుల్లో కలకలం రేపుతున్నాయి. జాతీయ రహదారికి సమీపంలో 11 ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా వ్యయసాయ భూమిని దర్జాగా ప్లాట్లు చేసి అమ్ముతున్నారు. అందులో ఎకరం వివాదంలోనే ఉండగా.. ఎలాంటి డీటీసీపీ పర్మిషన్ లేకుండా.. కనీసం నాలా కన్వర్షన్ చేసుకోకుండా వెంచర్ చేసి అమాయకులకు అంటగడుతున్నాడు సదరు యజమాని. ఈ అక్రమ దందాకు మండలంలోని రెవెన్యూశాఖలోని ఓ కీలక అధికారి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని కాకతీయ పత్రిక వెలుగులోకి తేవడంతో స్పందించిన కుడా అధికారులు గురువారం వెంచర్‌ను సందర్శించి ఓనర్‌కు నోటీసులు అందజేశారు. 5 రోజుల్లో అనుమతులు పొందాలని ఆదేశాలు జారీచేశారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే.. నోటీసులు అందుకోడానికి తొలుత ససేమిరా అన్న యజమాని.. తనకు అధికార పార్టీ నాయకుల సపోర్ట్ ఉందని.. ఎవరూ ఏం చేయలేరని ఆఫీసర్లను సైతం బెదిరించారు. అంతేగాక.. అక్రమ వెంచర్ వ్యవహారాన్ని బట్టబయలు చేసిన విలేకరికి ఫోన్‌లో వార్నింగ్ ఇచ్చారు. ఈక్రమంలోనే అక్రమ వెంచర్‌కు సంబంధించి స్థానికుల నుంచి వరుసగా ఫిర్యాదులు అందుతుండటం గమనార్హం.
ఇవీ నిబంధనలు..
వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చి ఇండ్ల స్థలాలుగా అమ్మాలంటే ఎకరానికి రూ.1.15 లక్షల చొప్పున ప్రభుత్వానికి చెల్లించాలి. కలెక్టర్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత వెంచర్‌లోని మొత్తం ప్లాట్లలో 15శాతం మున్సిపల్ కమిషనర్ పేరుమీద మార్టిగేజ్ చేయాలి. 10శాతం భూమిని పార్కు కోసం కేటాయించాలి. కావలసిన కరెంట్ స్తంభాలు పాతి, మురుగు కాలువలు తవ్వించి, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆ తర్వాతే ఈ ప్లాట్లను కమిషనర్ నుంచి వెంచర్ యజమానులకు తిరిగివస్తాయి. కానీ ఎల్కుర్తిలోని 11 ఎకరాల వెంచర్ ఓనర్ మాత్రం ఎలాంటి అనుమతులు పొందకుండానే తనకు అన్ని పర్మిషన్లు ఉన్నాయని బుకాయిస్తూ.. తప్పుడు పత్రాలు చూపుతూ యథేచ్చగా ప్లాట్లు క్రయవిక్రయాలు జరుపుతున్నాడు.
ఆందోళనలో బాధితులు
మొత్తం 11 ఎకరాల వ్యవసాయ భూమిలో స్థానిక రెవెన్యూ కార్యాలయంలోని ఓ కీలక అధికారి సహకారంతో కొంతమేర మాత్రమే నాలా కన్వర్షన్ చేయించి ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. వెంచర్‌లో రోడ్డు కోసం కొంత జాగా తీసి మొరంపోసి హద్దురాళ్లు పాతి వీటినే ప్లాట్లుగా ప్రచారం చేసి గజాల లెక్కన ఎక్కువ రేటుకు అమ్ముకుంటూ దర్జాగా సొమ్ము చేసుకుంటున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత ప్లాట్లలో ఇంటి పర్మిషన్ కోసం వెళ్ళిన సామాన్యుల నుంచి సవా లక్ష నిబంధన పేరుతో లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న ఆఫీసర్లు అక్రమ వెంచర్లను మాత్రం చూసీచూడనట్లుగా వదిలేస్తుండటం వెనుక ఆంతర్యమేంటన్నది అంతుబట్టడంలేదు. ఇప్పటికే పలువురు కొనుగోలుదారులు అడ్వాన్స్‌లు చెల్లించగా, ఇప్పుడు వెంచర్‌కు అనుమతి లేదని తెలిసి తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు.
రెవెన్యూ అధికారిపైనే ఆరోపణలు !
ధర్మసాగర్ మండలంలోని రెవెన్యూ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ కీలక ఆఫీసర్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ కార్యాలయంలోని సదరు అధికారి అండతోనే మండలంలో అక్రమ వెంచర్లు పుట్టుకొస్తున్నాయని, ఎల్కుర్తి వెంచర్ యజమానులకు కూడా ఆయన సపోర్ట్ దండిగానే ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ రహదారికి సమీపంలో 11 ఎకరాల్లో అక్రమ వెంచర్ చేయడం.. కుడా నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండానే, తీసుకున్నట్లు తప్పుడు పత్రాలు చూపిస్తూ సదరు అధికారి సహకారంతో రిజిస్టేషన్స్ చెయ్యడం వెనుక ఆంతర్యం ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పైగా మండలకేంద్రానికి కూతవేటు దూరంలోనే దర్జాగా ప్లాట్లు అమ్మకాలు జరుగుతున్నా.. సంబంధిత అధికారుల మొద్దు నిద్రపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ అక్రమ వెంచర్ వెనుక రెవెన్యూ అధికారుల ప్రమేయం ఉందని బహిరంగంగానే చెబుతున్నారు. అంతేకాదు.. ప్రభుత్వ నిబంధలనకు పాతరేసి కాసులకు కక్కుర్తిపడి వ్యవసాయ భూములను రియల్ వెంచర్లుగా మార్చేందుకు ఇష్టారాజ్యంగా అనుమతి ఇస్తున్నారని మండిపడుతున్నారు.
కలెక్టర్ దృష్టి సారిస్తారా ?
ఎల్కుర్తిలోని అక్రమ వెంచర్ వ్యవహారంపై పలువురు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అక్రమ దందాలో రెవెన్యూ అధికారుల పాత్ర ఉంటే విచారణ జరిపి, సంబంధిత ఆఫీసర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి అని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మండలంలో అనుమతిలేని వెంచర్లపై కలెక్టర్ దృష్టిసారించాలని కోరుతున్నారు.


