కాంగ్రెస్‌లో నీ పెత్తనం ఏందీరా..?!
టికెట్లు కార్యకర్తల హక్కు… నీ అయ్య ఆస్తి కాదు
కాంగ్రెస్ అంగట్లో సరుకు కాదు – త్యాగాల పార్టీ
అంతర్గత వ్యవహారాల్లో జోక్యం సహించం
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్
ఇద్దరి నేతల మధ్య మరింత ముదిరిన పొలిటికల్ వార్
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పెత్తనం చెలాయించాలనుకుంటే ఏమాత్రం సహించేది లేదని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌పై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టికెట్లు పంచుకునే హక్కు కాంగ్రెస్ కార్యకర్తలదేనని స్పష్టం చేస్తూ… “అవి నీ అయ్య సోమ్ము కాదు, నీ అవ్వ సోమ్ము కూడా కాదు” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అంగట్లో సరుకు కాదని, ఇది త్యాగాలు, పోరాటాలతో నిర్మితమైన పార్టీ అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలు వచ్చాయని కాంగ్రెస్‌లోకి దూరి పెత్తనం చెలాయించాలని చూస్తే నువ్వెవడివి రా..? అంటూ సంజయ్‌ను ఉద్దేశించి తీవ్రంగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేస్తే సహించేది లేదని కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
నిజమైన కాంగ్రెస్ వాదినే
తాను నిజమైన కాంగ్రెస్ వాదినని, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తల హక్కుల కోసమే చివరి శ్వాస వరకు పోరాటం చేస్తానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. సందులో వచ్చి సందులో దూకే రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఒప్పుకోదని తేల్చిచెప్పారు. శ్రీరామచంద్ర ప్రభువు ధర్మానికి కట్టుబడి రావణాసురుడి పది తలలు నరికాడని గుర్తు చేస్తూ… “నువ్వెంత రా… నీది ఒక్క తలకాయ మాత్రమే” అంటూ డాక్టర్ సంజయ్‌ను తీవ్రంగా ఎద్దేవా చేశారు. ధర్మమే కాంగ్రెస్ పార్టీకి ఆదర్శమని, అదే బాటలో పార్టీ నడుస్తుందని పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చూపిస్తాం
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క సీటు కాదు, ఏకంగా 50 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ పవర్ ఏంటో ప్రజలకు చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అడ్డం వచ్చిన వారిని రాజకీయంగా నరికేయాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మానికి కట్టుబడిన పాండవులు అజ్ఞాతవాసం చేశారని, ప్రస్తుతం మనమూ అజ్ఞాతవాసంలో ఉన్నామని అన్నారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తూ… అప్పటి వరకు కార్యకర్తలు తనకు అండగా ఉండాలని, తాను వారికి అండగా ఉంటానని పిలుపునిచ్చారు. చివరగా కాంగ్రెస్ పార్టీనే మనకు నిజమైన అండ అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.


