- ఎక్సైజ్ శాఖ అధికారుల తీరు వివాదాస్పదం
- సొంత పనులకు ప్రభుత్వ వాహనం
- డ్యూటీ టైంలోనే దర్జాగా వెహికిల్‌లో మద్యం బాటిళ్ల తరలింపు
- రూరల్ ఎక్జైజ్ శాఖ కార్యాలయంలోనే మందు పార్టీ!
- ఓ అధికారి రిటైర్మెంట్ సందర్భంగా చిల్ అయిన సిబ్బంది
- ఆఫీసర్లే నిబంధనలు ఉల్లంఘించడంపై సర్వత్రా విమర్శలు
- విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : జిల్లాలోని కొందరు ఎక్సైజ్ శాఖ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. విధులు విస్మరిస్తూ ప్రభుత్వ నిబంధనలు గాలికొదిలేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. విధి నిర్వహణ కోసం ప్రభుత్వం కేటాయించిన ప్రభుత్వ వాహనాన్ని తమ సొంత పనులకు వినియోగిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. అంతేగాక ఆఫీస్‌లోనే సిట్టింగ్ ఏర్పాటు చేసి దర్జాగా ప్రభుత్వ వాహనంలో మద్యాన్ని తరలిస్తున్న దృశ్యం కాకతీయ కెమెరాకి చిక్కింది. ఇదేంటని ప్రశ్నిస్తే అధికారులు పొంతనలేని సమాధానాలు చెప్పడం కొసమెరుపు.
అసలేం జరిగింది..
కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం సమీపంలోని ఒక వైన్స్ నుంచి కరీంనగర్ రూరల్ ఎక్సైజ్ శాఖ సిబ్బంది కొంతమంది విధి నిర్వహణ కోసం కేటాయించిన ప్రభుత్వ వాహనంలో మద్యం తరలించారు. అంతే కాకుండా ఒక వ్యక్తి వాహనంలో పెట్టిన తర్వాత మరో ఇద్దరు వచ్చి అదే ప్రభుత్వ వాహనంలో వెళ్లిపోవడం గమనార్హం.
ఆఫీస్‌లో రిటైర్‌మెంట్ ఫంక్షన్?
విశ్వసనీయ సమాచారం మేరకు.. కరీంనగర్ రూరల్ అబ్కారీశాఖలో విధులు నిర్వహిస్తున్న ఒక అధికారి కొంతకాలానికి రిటైర్‌మెంట్ కానున్నారు. దీంతో బుధవారం కరీంనగర్ రూరల్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలోనే ముందస్తుగా వేడుకులను నిర్వహించారు. ఈక్రమంలోనే అధికారులు, సిబ్బంది అంతా కలిసి పార్టీ చేసుకున్నట్లు సమాచారం. ఇదే విషయమై అధికారి వివరణ కోసం వెళ్లిన కాకతీయ ప్రతినిధికి ఈ తతంగం కంటబడండతో క్షణాల్లోనే అధికారులు అంతా ఖాళీ చేశారు. ఇక్కడ ఎలాంటి పార్టీ జరగడం లేదని, అంతా సాధరణంగా తమ విధులు నిర్వహిస్తున్నట్లు బుకాయించడం కొసమెరుపు.
పొంతనలేని సమాధానం..
ప్రభుత్వ వాహనంలోనే మద్యం బాటిళ్లు తరలిస్తున్న విషయమై కాకతీయ కరీంనగర్ రూరల్ ఎక్జైజ్ శాఖ అధికారి ఎస్‌హెచ్‌వోను వివరణ తీసుకునే ప్రయత్నం చేయగా సదరు అధికారి మాత్రం కార్యాలయంలో ఎలాంటి పార్టీ జరగలేదు.. సిబ్బంది ఎవరూ వాహనంలో మద్యం తరలించలేదు అంటూ పొంతనలేని సమాధానం చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా మద్యం బాటిళ్లను తరలించిన వాహనం వాహనం అదే కార్యాలయం ముందు ప్రత్యేక్షవడం.. కాసేపట్లోనే అక్కడి నుండి తరలించడం మరీ విశేషం.
విచారణ జరిపితే నిజాలు వెలుగులోకి..
నిబంధనల ప్రకారం విధులు నిర్వహించవలసిన అబ్కారీ శాఖ అధికారులు వాటిని విస్మరిస్తూ ప్రభుత్వ వాహనాలను తమ సొంత పనులకు వాడుకొవడం పట్ల ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులే ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ వాహనంలో మద్యం బాటిళ్లు తరలించడం, కార్యాలయంలో మద్యంతో రిటైర్‌మెంట్ వేడుకలు నిర్వహించడంపై ఉన్నతాధికారులు విచారణ జరిపితే పూర్తి నిజాలు వెలుగు చూసే అవకాశం ఉందని ప్రజలు అశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలకు పూనుకుంటారో లేదో వేచి చూడాలి.


