ఇదేంటి మేయర్..?!
ప్రభుత్వ భూమిని కాజేసిన గుండు సుధారాణి!
కమ్యూనిటీ హాల్ స్థలం కుటుంబ సభ్యుల మీద రిజిస్ట్రేషన్
హన్మకొండ చింతగట్టులో విలువైన రెండెకరాల స్థలం స్వాధీనం
పక్కా స్కెచ్‌తో ఏకపక్షంగా సొసైటీ ఏర్పాటు
భర్త, బంధువుల పేరిట చకాచకా రిజిస్ట్రేషన్
ఆ తర్వాత గుండు ప్రభాకర్‌కు స్థలం అప్పగింత
వరంగల్, హనుమకొండ జిల్లాల అవసరాల కోసం కేటాయించిన బీఆర్ఎస్ ప్రభుత్వం
విషయం తెలిసి భగ్గుమంటున్న పద్మశాలీ సంఘాల నేతలు
మేయర్ సుధారాణిపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : గతంలో పలు భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొన్న వరంగల్ నగరపాలక మేయర్ గుండు సుధారాణి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. పద్మశాలి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చింతగట్టులో కేటాయించిన రెండు ఎకరాల భూమిని పథకం ప్రకారం కొల్లగొట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన భర్త గుండు ప్రభాకర్‌ను ముందుపెట్టి.. కులానికి సంబంధించిన స్థలాన్ని సొంత జాగీర్‌లా దక్కించుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మేయర్ తీరుపై పద్మశాలీ కుల సంఘం నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో గుండు దంపతుల ఒంటెద్దు పోకడలతో తాము అణచివేతకు గురవుతున్నామని పలువురు పద్మశాలీ కుల సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియంతృత్వ పోకడలు అవలంబిస్తున్న గుండు దంపతుల నిజస్వరూపాన్ని త్వరలోనే బయటపెడతామని వారు హెచ్చరిస్తున్నారు.
అసలేం జరిగింది..
పద్మశాలి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టులోని సర్వే నంబర్ 146/2లో 34 గుంటలు, 155/1 లో 1.06 ఎకరం భూమిని (మొత్తం రెండెకరాలు) ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు 2021 ఫిబ్రవరి 10న మోమో నెంబర్ 8730/LA/A2/2020-2 ద్వారా ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈస్థలంపై వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఆది నుంచే కన్నేశారన్న విమర్శలు చేస్తున్నారు. అందులో భాగంగానే భర్త గుండు ప్రభాకర్‌ను ప్రెసిడెంట్‌గా, అల్లుడు కుందారపు అనిల్ కుమార్‌ను ట్రెజరర్‌గా పెట్టి డిస్ట్రిక్ట్ పద్మశాలి సంఘం వరంగల్ పేరిట రిజిస్టర్డ్ సొసైటీని ఏర్పాటు చేయించారని సంఘం నేతలు గుర్తు చేస్తున్నారు. అప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా డీఎస్ మూర్తి, ప్రధాన కార్యదర్శిగా గోరంటల రాజు ఉన్నారు. అయినప్పటికీ ప్రభాకర్, అనిల్ కోసం వీరిని కాదని నూతనంగా జిల్లా రిజిస్టార్ కార్యాలయంలో ఈ సొసైటీని ఏర్పాటు చేశారు.
సర్వసభ్య సమావేశం నిర్వహించకుండానే
జిల్లాలో పద్మశాలీ సంఘం సర్వసభ్య సమావేశాన్నీ నిర్వహించకుండానే, పద్మశాలి సంఘాల నేతలతో మాట్లాడకుండానే మేయర్ సుధారాణి ఏకపక్షంగా 2021 ఫిబ్రవరి 18న ఏడుగురు సభ్యులతో ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించి 112/2021 నంబర్ పై రిజిస్టర్డ్ చేయించారు. రామన్నపేట15 /8/41 ఇంటి నెంబర్‌ను ఇందులో ఆఫీస్ అడ్రస్‌గా చూపించారు. తన భర్త గుండు ప్రభాకర్‌కు ఈ రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పగించే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. వరంగల్ మేయర్ స్థానంలో ఉన్న ఆమె ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తేవడంతో 2021 జులై 14న హసన్ పర్తి ఇరిగేషన్ సబ్ డివిజన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఈ రెండెకరాల ప్రభుత్వ భూమిని గుండు ప్రభాకర్‌కు అధికారికంగా అప్పగించినట్లుగా ఆరోపణలున్నాయి.
పద్మశాలి ముఖ్య నేతలకు అన్యాయం..
వరంగల్, హనుమకొండ జిల్లాలను దృష్టిలో పెట్టుకొని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పద్మశాలీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం చింతగట్టులో రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పగిస్తే …112/2021 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లో జిల్లా పద్మశాలి సంఘం, యువజన సంఘం, పోపా సంఘాలతో పాటు ముఖ్య నేతలకు అవకాశం కల్పించలేదు. పద్మశాలి కుల చైతన్యం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న ముఖ్యులు వరంగల్ మహానగరంలో ఎంతోమంది ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా కుల సంఘం ఐక్యత, సంఘటితం కోసం పోరాడే వారికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వన్, టులో అవకాశం కల్పించకుండా అన్యాయం చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రజా సంఘాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్న పద్మశాలి కులస్థులను కూడా పట్టించుకోకుండా పద్మశాలి కులం అంటే తామే.. అనే నియంతృత్వ ధోరణితో వీరు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఏనాడు కులం గురించి పట్టించుకోని, కనీసం సమావేశాలకు కూడా హాజరు కానీ మేయర్ మేనల్లుడు కుందారపు అనిల్, గుల్లపల్లి రాజు, సామల శ్రీనివాసులను ఎగ్జిక్యూటివ్ కమిటీలో నియమించడాన్ని పద్మశాలి ముఖ్య నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించిన చింతగట్టు ప్రాంతం నుంచి ఒక్కరిని కూడా కార్యవర్గంలో కి తీసుకోకపోవడాన్ని వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు.
గుండు ప్రభాకర్ ఇష్టారాజ్యం
మేయర్ గుండు సుధారాణి వల్ల తమకు ఆది నుంచి అన్యాయమే జరుగుతున్నదని సీనియర్ పద్మశాలి కులస్థులు వాపోతున్నారు. మూడు దశాబ్దాల కమ్యూనిటీ హాల్ స్థలం కలను అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నెరవేరుస్తూ జీవో ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే! కుల సంఘం ప్రధాన నేతలకు కార్యవర్గంలో అవకాశం కల్పిస్తామని మొదట చెప్పి.. ఈ విషయాన్ని పట్టించుకోకుండా తమ సహజ స్వభావాన్ని గుండు సుధారాణి, ప్రభాకర్ దంపతులు చాటుకున్నారని ఆరోపిస్తున్నారు. డిస్ట్రిక్ట్ పద్మశాలి సంఘం వరంగల్ 112 /2021 రిజిస్ట్రేషన్ డాక్యుమెంటులో ఇంకో డజన్ మందికి అవకాశం కల్పించే వీలున్నా కేవలం ఏడుగురు తోనే ఈ తతంగం పూర్తి చేయించారనే విమర్శలు ఘాటుగా వినవస్తున్నాయి. ప్రస్తుతం అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న గుండు ప్రభాకర్ జిల్లా పద్మశాలి సంఘం ముఖ్య నేతలకు అవకాశం ఇవ్వకుండా తమను నిర్ధాక్షిణ్యంగా అణచివేశారని వారు వాపోతున్నారు. కుల దశాదిశను మార్చేందుకు కృషి చేస్తున్న పద్మశాలి పోరాట యోధులను పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నిస్తున్నారు.
ఒంటెద్దు పోకడలతో నష్టం..!
పద్మశాలి కులం పేరుతో టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో పలు రకాల పదవులు పొంది, నేడు వరంగల్ మేయర్ పదవిని రక్షించుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరిన గుండు సుధారాణి స్వచ్ఛమైన పద్మశాలి కుల సంఘం నేతలకు బాధ్యతలు ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా ఏకపక్షంగా 112 /2021 రిజిస్ట్రేషన్ చేయించి భర్త , అల్లునికి పెద్దపీట వేసిందని పద్మశాలీ సంఘం నేతలు భగ్గుమంటున్నారు. తన రాజకీయ ఎదుగుదలలో కులస్తులు కీలక పాత్ర పోషించారని స్వయంగా సుధారాణి పలు సమావేశాల్లో చెప్పారని, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా మేయర్ బాధ్యతలు చేపట్టాక ఆమె కులస్తులను శత్రువులుగా చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. వరంగల్ జిల్లాలో గుండు దంపతుల ఒంటెద్దు పోకడలతో తాము అణచివేతకు గురవుతున్నామని పలువురు పద్మశాలి కుల సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సొంత జాగీరా..?
హనుమకొండలో పద్మశాలి కమ్యూనిటీ హాల్ కోసం ప్రభుత్వం రెండెకరాల ప్రభుత్వ స్థలం కేటాయిస్తే.. వీరు సొంత జాగీర్ అనుకోని ఏడుగురితో కమిటీని పేపర్ పై వేసి రిజిస్టర్ చేయించడం ఎంతవరకు సమంజసమని పద్మశాలీలు ప్రశ్నిస్తున్నారు. పద్మశాలి కమ్యూనిటీ కోసం ఇచ్చిన స్థలంపై ఈ కుటుంబ సభ్యుల పెత్తనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పద్మశాలి సంఘం సర్వసభ్య సమావేశాన్ని తక్షణం ఏర్పాటు చేసి వాస్తవాలు బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


