నల్లమటు మత్తడి ధ్వంసం వెనుక మర్మమేంటి..?
పదేపదే మత్తడి ధ్వంసం.. అధికారుల మౌనం
చివరి ఆయకట్టుకు నీరు లేక పంటలపై ప్రభావం
విచారణ కోరుతూ రుద్రగూడెం రహదారిపై రైతుల రాస్తారోకో
తక్షణ చర్యలు చేపట్టకపోతే ఉద్యమం ఉధృతమంటూ హెచ్చరిక
కాకతీయ, నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో సాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. రంగాయి చెరువు చివరి ఆయకట్టుకు నీరు అందకపోవడంతో రైతులు మంగళవారం రుద్రగూడెం రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అయితే రైతుల ఆవేదన కేవలం నీటి కొరతకే పరిమితం కాకుండా, నల్లమట్టు చెరువు మత్తడి ధ్వంసం వెనుక దురుద్దేశాలు ఉన్నాయా? అనే అనుమానాలకు దారి తీసింది.
నల్లమట్టు చెరువులోని మత్తడి గత కొన్ని రోజులుగా పలుమార్లు ధ్వంసం కావడం రైతుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఒకసారి కాదు, వరుస ఘటనలుగా మత్తడి దెబ్బతింటున్నా ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. “ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు?” అన్న ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టత లేదని వారు విమర్శిస్తున్నారు.
నీరు లేక ఎండుతున్న పొలాలు
చివరి ఆయకట్టుకు సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోయారు. పంటల కీలక సమయంలో కూడా నీటి సరఫరా చేయలేని పరిస్థితికి అధికారులే బాధ్యత వహించాలన్నారు. అధికారుల మౌనం అనుమానాలను మరింత బలపరుస్తోందని, సమస్యను ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడం లేదన్న భావన రైతుల్లో నెలకొందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఉన్నతస్థాయి విచారణ చేపట్టి మత్తడి ధ్వంసానికి కారణాలను గుర్తించాలని రైతులు డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, చెరువు చివరి ఆయకట్టువరకు సమానంగా సాగునీరు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో మొదటి ఆయకట్టు–చివరి ఆయకట్టు రైతుల మధ్య విభేదాలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
పోలీసుల జోక్యంతో విరమణ
సమాచారం అందుకున్న ఎస్సై గోవర్ధన్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి దర్యాప్తు, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకోను విరమించారు. మొత్తానికి, నల్లమట్టు మత్తడి ధ్వంసం వెనుక నిజాలు వెలుగులోకి రావాలంటే తక్షణ, పారదర్శక విచారణే మార్గమని రైతులు స్పష్టం చేస్తున్నారు. సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం మరింత ఉధృతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.


