మేడిగడ్డలో పేలుళ్ల శబ్దాలపై విచారణేది..?
బ్యారేజీ 20వ పిల్లర్‌ను పేల్చే కుట్ర..?
కాళేశ్వరంపై ఆది నుంచి కాంగ్రెస్, బీజేపీ బురద
స్క్రిప్ట్ రాసుకున్నట్లుగా పరిణామాలు జరిగాయి
ఎన్.డీ.ఎస్.ఏ ఎందుకు మేడిగడ్డ వద్ద మౌనం వహిస్తోంది..?
బ్యారేజీ కుంగడంపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : మేడిగడ్డ ప్రాజెక్టులో 20వ పిల్లర్‌ను ఎవరో పేల్చే కుట్ర చేశారంటూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్సం చలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 21, 2023న మేడిగడ్డ వద్ద పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించాయని, అక్టోబర్ 22న మహదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ ఫిర్యాదులో అసాంఘిక శక్తులు ఉన్నట్లు ప్రస్తావించారని పేర్కొన్నారు. 2022లో రికార్డు స్థాయి వరదలు వచ్చినా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు తట్టుకున్నాయని, ఇప్పుడు ఒక్క పిల్లర్ మాత్రమే ఎందుకు కుంగిపోయిందో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. మహదేవ్‌పూర్ పోలీసులు వెంటనే విచారణ చేసి ఉంటే నిజాలు బహిర్గతం అయ్యేవని విమర్శించారు. మేడి గడ్డ వద్ద పేలుళ్ల శబ్దాల పై ఇప్పటివరకు ఎలాంటి విచారణ జరగలేదని, ఎవరి స్టేట్మెంట్ కూడా రికార్డు చేయలేదని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చివేసే కుట్ర వెనుక కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయని ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ కుంగడం వెనుక గుర్తు తెలియని వ్యక్తుల ప్రమేయం ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. అసాంఘిక శక్తులపై విచారణ జరపక పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.

మేడిగడ్డ పేలుళ్లపై సిట్ ఏర్పాటు చేయాలి
మేడిగడ్డ పేలుళ్లపై ప్రత్యేక విచారణ బృందం (సిట్) ఏర్పాటు చేసి నిజాలను వెలికితీయాలని మరోసారి డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. దీని వెనుక రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి ఉన్నారా లేదా అనేది సిట్ ద్వారా తేల్చాలని డిమాండ్ చేయడం గమనార్హం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిష్ఠను దెబ్బతీయడానికి, ప్రాజెక్టు వైఫల్యమైందని బురద జల్లేందుకు కాంగ్రెస్, బీజేపీ మొదట్నుంచి కుట్ర పన్నాయని ఆరోపించారు. కేసీఆర్‌ను గద్దె దింపడానికి కాంగ్రెస్, బీజేపీ కలిసి స్క్రిప్ట్ రాసినట్లు డ్రామా ఆడుతూ వస్తున్నాయని అన్నారు. కిషన్ రెడ్డి లేఖ రాయగానే ఎన్.డీ.ఎస్.ఏ వచ్చిందని, కానీ ఉత్తరాఖండ్ లో మొత్తం డ్యామ్ కొట్టుకు పోయినా ఎన్.డీ.ఎస్.ఏ వెళ్లలేదంటూ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఆంధ్రా పెట్టుబడిదారుల ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని, సీం రమేష్ కంపెనీలకు తెలంగాణలో కాంట్రాక్టులు లభించాయని ఆయన ఆరోపించారు. రేవంత్ వెనుక 20మంది ఆంధ్రా కాంట్రాక్టర్లు ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పిన మాటలను ప్రస్తావించారు. సమావేశంలో సుమిత్రానంద్, ఇంతియాజ్ అహ్మద్, అభిలాష్ రంగినేని, కల్వకుర్తి శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


