ఆల్మట్టిపై నిర్ణయమేంటి..?
రాష్ట్ర సర్కారు ముందు జల పరీక్ష
పొరుగు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు
బ్రిజేష్ ట్రిబ్యూనల్ తీర్పును ఉల్లంఘిస్తూ ఆనకట్ట ఎత్తు పెంపునకు నిర్ణయం
100టీఎంసీలకు పైగా నీటిని నిల్వను చేసేందుకు యత్నాలు
ఇప్పటికే కేబినేట్ ఆమోదం.. బడ్జెట్ కేటాయింపులు పూర్తి
5మీటర్ల పెంపుతో దిగువన తెలుగు రాష్ట్రాలకు జల కష్టాలే
శ్రైశైలం,నాగార్జున సాగర్‌లకు తగ్గగనున్న నీటి లభ్యత
ముంపు ప్రాంతాలు పెరుగుతాయని మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం
జోక్యం చేసుకోవాలంటూ కేంద్రానికి సీఎంవో లేఖ
మనకు జరిగే నీటి నష్టాలపై ఇప్పటికీ నోరు మెదపని రేవంత్ సర్కారు
కర్ణాటకలో సొంత పార్టీ ప్రభుత్వమే ఉండటంతో తకమిక
ఏదో ఒక కార్యాచరణ తీసుకోకుంటే దోషిగా మిగిలే ప్రమాదం!
వాడీ వేడి విమర్శలతో సెగ రేపుతున్న బీజేపీ, కాంగ్రెస్
విపక్షాలకు ఆయుధంగా ఆమరే అవకాశం..!
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర జల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై విపక్షాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రాష్ట్ర సర్కారు దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోవడంతో విపక్షాల విమర్శల వాడిని పెంచుతున్నాయి. కర్ణాటకలోనూ సొంత పార్టీ ప్రభుత్వమే ఉండటం.. జాతీయ పార్టీకి జాతీయ విధానం ఉండదా..? అంటూ బీఆర్ఎస్ పార్టీ ఎత్తిపోడుస్తోంది. ఈ నేపథ్యంలో సొంత పార్టీ జాతీయ నాయకత్వం ఎలాంటి వైఖరి సూచిస్తుంది.. ఆ వైఖరి కర్ణాటకు అనుకూలంగా ఉంటుందా..? తెలంగాణ ప్రభుత్వానికి సముచితంగా అనిపించేలా ఉంటుందా ఉండదా అన్న సందేహాలు ఇటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యులను వెంటాడుతున్నాయని సమాచారం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తీసుకునే వైఖరి, స్టాండ్ ఆధారంగా బీఆర్ఎస్, బీజేపీలు పోరాటాలకు సన్నద్ధమవ్వాలనే యోచనతో ఉండటం రాజకీయ వాతావరణాన్ని సైతం వేడెక్కిస్తోంది. మొత్తంగా ఆల్మట్టి ఆనకట్ట అంశం అధికార కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని కొంత ఇరాకాటంలో పడేస్తున్నట్లుగా విశ్లేషణ జరుగుతోంది.
దూకుడుగా కర్ణాటక ప్రభుత్వం నిర్ణయాలు..!
బ్రిజేష్ ట్రిబ్యూనల్ తీర్పును ఉల్లంఘిస్తూ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును 5మీటర్ల మేర పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈసారి ఎవరి మాట వినేది లేదన్నట్లుగా సిద్ధరామయ్య ప్రభుత్వం వ్యవహార శైలి కనిపిస్తుండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండానే భూసేకరణకు, నిర్మాణాలకు ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు చేయడం గమనార్హం. అయితే ఆనకట్ట పెంపు చేపడితే దిగువ రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటి కష్టాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. అలాగే సరిహద్దును పంచుకుంటున్న మహారాష్ట్రలోని సాంగ్లి,కొల్హాపూర్ జిల్లాల్లో ముంపు ప్రాంతాలు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాకుండా వరద ఉధృతిలో ఫ్రీక్వెన్సీ దెబ్బతింటుందని వరదలు సంభవించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని మహారాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఇప్పటిక మహారాష్ట్ర సీఎంవో కార్యాలయం ఇటు కర్ణాటక ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
ఆల్మట్టి బ్యాక్ వాటర్స్ ప్రభావంపై వివరణాత్మక హైడ్రోడైనమిక్ మరియు సిమ్యులేషన్ అధ్యయనం నిర్వహించాలని మహారాష్ట్ర ప్రభుత్వం రూర్కీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీని కోరింది. తుది నివేదిక వచ్చాకే అనుమతుల విషయంలో స్పష్టమైన నిర్ణయాలను వెలువరుచాలని కోరింది. ఇదిలా ఉండగా జూన్ 9న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన లేఖలో సిద్ధరామయ్యను ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. ఆనకట్ట ఎత్తు పెరగడం వల్ల సాంగ్లి మరియు కొల్హాపూర్ జిల్లాలలో వరదలు సంభవిస్తాయని పేర్కొన్నారు. మరోవైపు ఆల్మట్టి ఆనకట్ట పెంపు ప్రయత్నాలను విరమించుకునేలా జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం జూన్ నెలలోనే ఫడ్నవీస్ కేంద్రాన్ని కోరింది.
మాకు అనుమతులు అక్కర్లేదు..!
జూన్ 11న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీఎం ఫడ్నీవీస్ రాసిన లేఖకు రిప్లై ఇచ్చారు. ఆనకట్ట ఎత్తును పెంచడానికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముంపు సమస్యలపైనే కాకుండా, 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 6(1) ప్రకారం కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రచురణకు వేచి ఉండకుండానే ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును పూర్తి రిజర్వాయర్ స్థాయి(ఎఫ్ ఆర్ ఎల్) 524.256 ఎమ్‌కు పెంచుకునే హక్కు ఉందని పేర్కొన్నారు. “కర్ణాటక రాష్ట్రం 1969లోనే ఎఫ్ఆర్ఎల్ 524.256 ఎం వరకు ఆల్మట్టి ఆనకట్ట నిర్మాణాన్ని ప్లాన్ చేసింది. జస్టిస్ ఆర్ఎస్ బచావత్ నేతృత్వంలోని కృష్ణ జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ-I) మరియు తరువాత 1956 అంతర్ రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం కింద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కేడబ్ల్యూడీటీ-II ఆల్మట్టి ఆనకట్ట ఎత్తుపై ఎటువంటి పరిమితులు విధించలేదని సిద్ధరామయ్య తన లేఖలో స్పష్టం చేయడం గమనార్హం. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లేఖ కర్ణాటక
తెలుగు రాష్ట్రాలకు జలఘాతమే..!
ఆల్మట్టి ఆనకట్ట ప్రస్తుతం 519 మీటర్లు ఉండగా దీన్ని 524 మీటర్లకు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం దశాబ్దకాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. పొరుగు,దిగువ రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఆగుతూ వస్తోంది. అయితే ఈసారి సిద్ధరామయ్య ప్రభుత్వం ఆనకట్ట ఎత్తు పెంపు అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుండట గమనార్హం. ఆనకట్ట పెంపు జరిగితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వచ్చే వరదనీరు చాలా వరకు తగ్గుతుందని నీటిపారుదల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలోని లక్షలాది ఎకరకాల ఆయకట్టును ఎడారిగా మార్చే ప్రమాదం ఉందంటున్నారు. దీనిపై ఆధారపడ్డ రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. తెలంగాణలో అయితే నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని విపక్షాలు గళం వినిపిస్తున్న నేపథ్యంలో ఆల్మట్టి అంశం భవిష్యత్‌లో రాజకీయ, సామాజిక పోరాటాలకు దారితీయనుందన్న విశ్లేషణ జరుగుతోంది.


