యూరియా టోకెన్ల దందా
చెన్నారావుపేటలో బయటపడిన ఏవో దందా
సోషల్ మీడియాలో వైరల్ అయిన అధికారి ఆడియో సంభాషణ
“క్షమించండి.. మళ్లీ జరగదు” అంటూ సర్పంచ్‌కు రిక్వెస్ట్
కాకతీయ, నర్సంపేట : వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పదహారు చింతల తండ గ్రామంలో యూరియా కొరత మధ్య అగ్రికల్చర్ ఆఫీసర్ (ఏఓ) టోకెన్లను అక్రమంగా విక్రయించాడన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రైతులకు కేటాయించాల్సిన యూరియా టోకెన్లు దళారుల చేతుల్లో ప్రత్యక్షమవ్వడంతో అధికారుల పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆడియో సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది. ప్రభుత్వ సూచనల మేరకు గ్రామ పంచాయతీల వద్ద రైతులు టోకెన్లు రాయించుకున్నప్పటికీ, జనవరి 6న పెద్ద సంఖ్యలో టోకెన్లు రైతులకు కాకుండా ఇతరులకు కేటాయించబడ్డాయని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఏఈవో సంతకంతో పెద్ద మొత్తంలో టోకెన్లు వెలుగులోకి రావడం అనుమానాలకు తావిస్తోంది.
సర్పంచ్–ఏఓ ఆడియో వైరల్
ఈ అంశాన్ని రైతులు గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లగా, సర్పంచ్ మండల ఏఓకు ఫోన్ చేసి వివరణ కోరారు. “రైతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? టోకెన్లు డబ్బులకు అమ్మారా?” అని ప్రశ్నించగా, ఏఓ తన తప్పును అంగీకరిస్తూ “నాకు తెలియకుండా తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించండి.. మళ్లీ రిపీట్ కాకుండా చూస్తాను, దండం పెడతా” అంటూ బ్రతిమాలినట్లు ఆ ఆడియోలో వినిపిస్తోంది.
అయితే, అధికారికంగా సర్పంచ్ వివరణ కోరినప్పుడు మాత్రం “టోకెన్లు ఎలా మిస్ అయ్యాయో తెలియదు” అంటూ ఏఓ చాకచక్యంగా తప్పించుకున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో ఏఓ స్వయంగా ఈ అక్రమానికి పాల్పడ్డాడా? లేక ఏఈవోలతో కలిసి వ్యవహారం నడిపించాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రైతుల ఆవేదన
యాసంగి పంటల సమయంలో యూరియా కొరత తీవ్రమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు వేదికల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తున్నా సరైన సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో టోకెన్ల అక్రమ విక్రయం జరగడం వల్ల అసలైన రైతులు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ రైతులకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చిన నేపథ్యంలో, ఈ ఆరోపణలపై మండల, జిల్లా స్థాయి అధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. యూరియా కొరతతో ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైతాంగానికి ఈ ఘటన మరింత ఆందోళన కలిగిస్తోంది.


