ఏం తమాషా చేస్తున్నారా?.
మైసమ్మ ఆలయాల కూల్చివేతపై బండి సంజయ్ ఆగ్రహం.
అధికారులకు 48 గంటల గడువు.
కాకతీయ, గోదావరిఖని : గోదావరిఖని,ఎన్‌టీపీసీ రోడ్డుపై ఉన్న 46 మైసమ్మ ఆలయాలను కూల్చివేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, వెంటనే పునర్నిర్మాణం చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.రోడ్డు విస్తరణ పేరుతో ఆలయాలను కూల్చివేస్తూ, అదే రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను వదిలేయడం వెనుక ఏ ఉద్దేశ్యమో అధికారులే చెప్పాలని ఆయన ప్రశ్నించారు. హైదరాబాదులోని తన నివాసం నుండి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీలకు ఫోన్ చేసి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుకు అడ్డంగా మసీదులు కూడా ఉన్నాయి కదా? మరి అవి ఎందుకు కూల్చలేదు? హిందూ ఆలయాలంటే అంత చులకనా? అని ఆయన ప్రశ్నించారు. అధికారుల సమాధానాలు తృప్తికరంగా లేకపోవడంతో, ఏం తమాషా చేస్తున్నారా? ఎవరి మెప్పు కోసం ఇంత దుర్మార్గంగా ఆలయాలను కూల్చారు? అంటూ బండి సంజయ్ మండిపడ్డారు.మీకు 48 గంటల గడువు ఇస్తున్నా. కూల్చివేసిన మైసమ్మ ఆలయాలను ఆ సమయానికి పునర్నిర్మించండి.
లేకపోతే రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను కూడా కూల్చివేయాల్సిందే. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే నేనే గోదావరిఖని వస్తా. అక్కడి పరిస్థితులు నేను స్వయంగా చూస్తా. ఆలయాలను పునర్నిర్మించకపోతే మసీదులన్నింటినీ కూల్చివేయిస్తా అని ఆయన హెచ్చరించారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా సంబంధిత అధికారులందరినీ ప్రజల ముందుకు తీసుకువస్తానని, భవిష్యత్తులో ఏర్పడే పరిణామాలకు వారు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆయన ప్రస్తుతం పార్టీ రాష్ట్ర నాయకులు, పెద్దపల్లి జిల్లా నేతలతో తదుపరి చర్యలపై చర్చలు జరుపుతున్నారు.స్థానికంగా ఆలయాల కూల్చివేతపై భక్తుల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది. ప్రతిరోజూ భక్తులు మొక్కుకునే దారి మైసమ్మ ఆలయాలను అర్ధరాత్రి వేళ కూల్చివేయడంతో ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పునర్నిర్మాణం జరిగే వరకు నిరసనలు కొనసాగిస్తామని భక్తులు స్పష్టం చేస్తున్నారు.


