తడి–పొడి చెత్త వేరు చేయాలి
ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా బయో డిగ్రేడబుల్ సంచులు వినియోగించాలి
33వ డివిజన్‌లో చెత్త సేకరణపై కమిషనర్ చాహత్ బాజ్‌పేయి తనిఖీ
ద్వారకామయి అపార్ట్‌మెంట్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక
డ్రైన్లలో సిల్ట్ పూర్తిగా తొలగించాలని ఆదేశాలు
కాకతీయ, వరంగల్ : నగరంలోని అపార్ట్‌మెంట్లలో తడి, పొడి చెత్తను వేరు వేరుగా సేకరించే విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ స్పష్టం చేశారు. శుక్రవారం వరంగల్ నగర పరిధిలోని 33వ డివిజన్ పెరికవాడ ప్రాంతంలో తడి–పొడి చెత్త సేకరణ తీరును కమిషనర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ద్వారకామయి అపార్ట్‌మెంట్ వాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అపార్ట్‌మెంట్లలో కుటుంబాలు సమూహాలుగా నివసిస్తుండటంతో ఇక్కడి నుంచి చెత్త సేకరణ సులభంగా, పెద్ద మొత్తంలో జరుగుతుందని తెలిపారు. అందుకే ద్వారకామయి అపార్ట్‌మెంట్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకుని తడి–పొడి చెత్తను వేరు వేరుగా సేకరించే విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు.
ప్లాస్టిక్‌కు గుడ్‌బై
ప్లాస్టిక్ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా బయో డిగ్రేడబుల్ సంచులు, కాగితపు సంచులు, బట్ట, జ్యూట్ సంచులు వినియోగించాలని కమిషనర్ పిలుపునిచ్చారు. చెత్తను వేరు చేయడానికి అపార్ట్‌మెంట్ వాసులు ప్రత్యేకంగా నాలుగు డ్రమ్ములు ఏర్పాటు చేసుకోవడం హర్షణీయమని పేర్కొంటూ, ఇదే విధానాన్ని ఇతర అపార్ట్‌మెంట్‌లలోనూ అమలు చేయాలని శానిటేషన్ అధికారులను ఆదేశించారు. అనంతరం అదే ప్రాంతంలోని డ్రైన్లలో సిల్ట్ తొలగింపు పనులను కమిషనర్ పరిశీలించారు. డ్రైన్లలో లోతు వరకు సిల్ట్ పూర్తిగా తొలగించాలని, జంక్షన్‌ల వద్ద ప్లాస్టిక్ సంచులు, బాటిళ్లు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ముష్కమల్ల అరుణ, ఎంహెచ్‌ఓ డా. రాజేష్, సానిటరీ సూపర్వైజర్ గోల్కొండ శ్రీను, సానిటరీ ఇన్‌స్పెక్టర్ రాజు, కమ్యూనిటీ ఆర్గనైజర్ సుజాత, వావ్ ప్రతినిధి పవన్ ఆర్.పిలు తదితరులు పాల్గొన్నారు.


