- కలెక్టర్ పమేలా సత్పతి
- మధ్యాహ్న భోజనం పరిశీలన
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం బోధన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం పర్యవేక్షించారు. విద్యార్థులకు కఠినమైన పాఠ్యాంశాలు నేర్పించేందుకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుందని ఆమె అన్నారు. ప్రతీ బుధవారం అన్ని పాఠశాలల్లో బుధవారం బోధన కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ విద్యార్థులతో తొమ్మిదో తరగతి పాఠాలు చదివించారు. నోటుబుక్స్ పరిశీలించి రైటింగ్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కఠినమైన పాఠాలను ఎంచుకుని శ్రద్ధగా నేర్చుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్..
మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కూరలు, ఆకుకూరలు, గుడ్లు తప్పకుండా తినాలని సూచించారు. ఆహార పదార్థాల్లోని పోషకాలపై విద్యార్థులను ప్రశ్నించి వివరించారు. పాఠశాలలో నల్లాలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజేష్, ఎంఈఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


