మేడారం కీర్తి ప్రపంచానికి చాటుతాం
సమ్మక్క–సారలమ్మల వైభవం తరతరాలకూ నిలిచేలా చేస్తాం
వెయ్యేళ్లు శాశ్వతంగా ఉండేలా రాతితో నిర్మాణాలు
ఆలయ పునర్నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
కాకతీయ, ములుగు ప్రతినిధి : సమ్మక్క–సారలమ్మ జాతర ప్రాంగణం శాశ్వతాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. మంగళవారం సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి మేడారం గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, గద్దెల ప్రాంగణం ఆధునికీకరణకు రూపొందించిన డిజిటల్ మాస్టర్ ప్లాన్‌ను విడుదల చేశారు. మధ్యాహ్నం 12.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, పూజారులు సాంప్రదాయ నృత్యాలు, డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. సీఎం వెంట రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సలహాదారు వేంకట నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మహబూబాబాద్, వరంగల్ ఎంపీలు పొరిక బాలరాం నాయక్, డా.కడియం కావ్య, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ శబరిష్ తదితరులు పాల్గొన్నారు.

రాతి కట్టడాలతో చరిత్ర సృష్టి….
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సమ్మక్క–సారలమ్మ గద్దెలు రాబోయే వందల సంవత్సరాలకు ఆదర్శంగా నిలవాలి అని, అందుకే ఈ ప్రాంగణంలో సిమెంట్ కట్టడాలకు బదులు రాతి కట్టడాలతో శాశ్వత నిర్మాణాలు చేపడతాం అని,రుద్రదేవుడు కట్టించిన రామప్ప ఆలయం ఎనిమిది వందల సంవత్సరాలైనా నిలిచినట్టు ఇక్కడి నిర్మాణాలు వందల ఏళ్లు నిలవాలి అని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు 100 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించామని ఆయన వెల్లడించారు. జనవరి 28 నుండి 31 మధ్య జరిగే మహాజాతర నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఆదివాసి సంప్రదాయాలకు ప్రాధాన్యం
ప్రణాళికలు ప్రభుత్వం చేస్తోంది కానీ సాంప్రదాయాలు ఆదివాసులవి అని, నిర్మాణం నుంచి సంరక్షణ వరకు ఆదివాసీల భాగస్వామ్యంతోనే కొనసాగిస్తాం అని సీఎం తెలిపారు. పరిశోధకులు, వారసులు, స్థానిక గిరిజన ప్రతినిధులు నిర్మాణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని కోరారు. జాతరను దేశంలోని కుంభమేళాల తరహాలో జాతీయ పండుగగా గుర్తించాలని, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఉత్తరప్రదేశ్‌లో అయోధ్యకు లభిస్తున్న గుర్తింపు, సహకారం లాగే తెలంగాణ ములుగు అడవుల్లో ఉన్న సమ్మక్క–సారలమ్మ జాతర కూడా దేశ పండుగగా గుర్తింపును పొందాలి అని ఆయన విన్నవించారు.
సీతక్క కృతజ్ఞతలు!!
కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన పంచాయతీరాజ్ మంత్రి సీతక్క మాట్లాడుతూ సమ్మక్క–సారలమ్మ జాతరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు అని, ఆయన సంకల్పంతో ఈ ప్రాంతం శాశ్వతాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది అని పేర్కొన్నారు.
వైభవం తరతరాలకు
ప్రభుత్వం చేపట్టిన శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలతో మేడారం గద్దెల ప్రాంగణం కొత్త అందచందాలతో అలంకరించబడనుంది. రాబోయే జాతర నాటికి యావత్ దేశం, ప్రపంచం నుంచి వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయి.


