స్థానిక ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తాం
రాష్ర్టాన్ని అప్పుల పాలు చేసిన బీఆర్ఎస్
కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
కాకతీయ, కరీంనగర్: మునిసిపల్‌తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు శుక్రవారం ధీమా వ్యక్తం చేశారు. వెలిచాల ప్రజా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అందే మమతతో పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరారు. రాజేందర్ రావు వారిని పార్టీకి ఆహ్వానిస్తూ కండువాలు కప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. గతంలో బిఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని నిర్లక్ష్యపరిచారని ఆర్థిక ఇబ్బందులను పెంచారని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల నరసన్న, కాంగ్రెస్ నాయకులు నిమ్మల అంజయ్య, మల్యాల రాజాగౌడ్, సుందరగిరి గంగరాజు, పెంట శేఖర్, గుండ మల్లేశం, ఆరె మల్లేశం గౌడ్, దుర్గం అంజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


