- రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి : అంగన్వాడి, ఆశా వర్కర్ల సమస్యలను విడతలవారీగా పరిష్కరించడానికి కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాలలో ఆమె పాల్గొన్నారు. ముందుగా గిరిజన భవన్‌లో ములుగు, మల్లంపల్లి మండలాల అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్‌లో అంగన్వాడి టీచర్లు, ఆయాలకు ఏకరూప దుస్తులను (యూనిఫాం) అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడి పాఠశాలలను మూసివేస్తున్నారన్న ప్రచారం అసత్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభమయ్యాయని వివరించారు. పిల్లలకు పౌష్టికాహారం, మంచి సంరక్షణ అందేలా అంగన్వాడి సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందిస్తున్నదని, సోలార్ ప్లాంట్లు, ఆటోలు, వాహనాలు, బస్సుల కొనుగోలు ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారని తెలిపారు.
ప్రతి మహిళా సంఘం భరోసా, తోటి సభ్యులు కష్టసుఖాల్లో తోడుంటారని, ఈ అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ములుగు నియోజకవర్గంలో పదివేల మందికి పైగా రేషన్ కార్డులు పంపిణీ చేసిందని, కొత్తగా కార్డులు అందజేయడమే కాకుండా సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తోందని వివరించారు. ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు అండగా నిలవాలని ఆమె కోరారు. తరువాత డీఎల్ఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన బతుకమ్మలో పాల్గొన్న మంత్రి సీతక్క మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సి.హెచ్.మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, డీడబ్ల్యూఓ తుల రవి, డీసీఎస్ఓ షా ఫైజల్ హుస్సైనీ, సిడిపిఓలు, అంగన్వాడి టీచర్లు, ఆయాలు, రేషన్ కార్డు లబ్ధిదారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


