కాకతీయ, మహబూబాబాద్ : జిల్లాలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా జిల్లా అధికారులను సమన్వయపరిచి రైతులందరికీ యూరియా సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ మరిపెడ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయలను పరిశీలించారు.
మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యూరియా పంపిణీ కేంద్రాన్ని సందర్శించి సరఫరా చేస్తున్న ప్రక్రియను పారదర్శకంగా చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ రైతుకు అందే విధంగా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. మరిపెడ మండలం గిరిపురంలో ఉన్న కేజీబీవీ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పిల్లలకు షెడ్యూలు ప్రకారం సూచించిన విధంగా బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్, వైద్య పరీక్షలు, ప్రతి సబ్జెక్టు పై అవగాహన డిజిటల్ తరగతులు క్రీడా సాంస్కృతిక విభాగాలలో శిక్షణలో అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి డాక్టర్ కిరణ్ కుమార్, వ్యవసాయ శాఖ ఏడీఏ విజయ్ చందర్, తహశీల్దార్ కృష్ణవేణి, తదితరులున్నారు.అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో నరసింహుల పేటలోని ప్రాథమిక సహకార వ్యవసాయ సొసైటీ, పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు.


