కాకతీయ, గోదావరిఖ : తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చిన్న చూపు చూస్తుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో ఏంపీ గడ్డం వంశీ కృష్ణ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లడుతూ.. తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యపై పార్లమెంటులో ప్రస్తావించడం జరిగిందని, తెలంగాణకు వచ్చే కోటాను పూర్తిస్థాయిలో అందించాలని కేంద్ర మంత్రులకు వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు.
తొమ్మిది లక్షల టన్నుల యూరియాకు గాను నాలుగున్నర లక్షల టన్నులను మాత్రమే ఇచ్చారని, విదేశాల నుండి రావలసిన 30 లక్షల టన్నుల యూరియా రాలేదని మంత్రులు తెలిపారన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న చర్యల మూలంగా విదేశాల నుండి యూరియా రావడం లేదని, తెలంగాణకు 50 వేల టన్నుల యూరియాను అందిస్తామని నడ్డా ఒప్పుకున్నారని తెలిపారు. వచ్చే వారం పది రోజుల్లో 25 వేల టన్నుల యూరియాను రాష్ట్రానికి అందించనున్నట్లు ఆయన తెలిపారు.
రామగుండం ఎరువుల కర్మకారాన్ని సందర్శించి కర్మాకారంలో ఏర్పడిన లోపాలను తెలుసుకోవడం జరిగిందని, అందులో తలెత్తిన లోపాలను సవరించి ఉత్పత్తి దశలోకి తీసుకురావాలని ఆదేశాలు చేయడం జరిగిందన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్లాంట్ లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని కేంద్ర మంత్రులకు వివరించామని, దేశ ప్రధాని గ్రౌండ్ లెవల్ లోకి వచ్చి ఫ్యాక్టరీలో జరిగే లోపాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. అంతే కాకుండా బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
రామగుండం విమానాశ్రయంపై ఇప్పటికే కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చామని, ఆంధ్రప్రదేశ్ కు ఎనిమిది నుంచి పది విమానాశ్రయాలు ఉంటే తెలంగాణలో మాత్రం ఒకే ఒక్క విమానాశ్రయం ఉందని తెలిపామన్నారు. రామగుండం ప్రజల చిరకాల కోరిక నెరవేర్చేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా ఆయన తెలిపారు.
రామగుండంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలని పార్లమెంటులో ప్రస్తావించడం జరిగిందని త్వరితగతిన టెండర్ ప్రక్రియ పూర్తిచేసి ఆసుపత్రిని నెలకొల్పాలని కోరామని తెలిపారు. పాలకుర్తి మండలం కన్నాల ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కేంద్ర మంత్రులను రైల్వే అధికారులను కలిశామని, రూ.80 కోట్ల నిధులతో నిర్మాణానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. త్వరలో పనులు ప్రారంభించి ప్రజా రవాణా మెరుగుపడేలా చర్యలు చేపడతామని ఎంపీ అన్నారు.


