వరద బాధితులకు సహకారం అందిస్తాం
వరంగల్ మేయర్ గుండు సుధారాణి
కాకతీయ, వరంగల్ : వరద ప్రభావిత బాధితులకు అన్ని విధాల సహకారం అందిస్తామని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. ఆదివారం వరంగల్ పరిధిలో వరద ప్రభావానికి గురైన ఎన్టీఆర్ కాలనీ, రామన్నపేట, సంతోషిమాత కాలనీ ఫేజ్-1, ఫేజ్-2 గంగ పుత్ర కాలనీ, డీఆర్ నగర్ ఎస్ఆర్ఆర్ తోట ప్రాంతాలలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వరదల వల్ల నష్టపోయిన గృహాలను గుర్తించి సంబంధిత సమాచారాన్ని నమోదు చేయడం జరుగుతుందన్నారు. వర్షాల వల్ల ఏర్పడిన బురదతో పాటు చెత్త చెదారం తొలగింపు ప్రక్రియ జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు కొనసాగుతున్న అసెస్మెంట్ ను మేయర్ కమిషనర్ ఇరువురు పరిశీలించారు. వార్డు ఆఫీసర్లు రెవెన్యూ సిబ్బంది జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి అంచనా వేసి వాస్తవ సమాచారాన్ని అందజేయాలని సూచించారు. వరంగల్ ప్రాంతంలో 5 జేసీబీలు, హన్మకొండ ప్రాంతంలో 6 జేసీబీలు, ట్రాక్టర్ ల సహాయంతో వరద వల్ల ఏర్పడిన బురదను తొలగించడం జరుగుతుందని చెప్పారు. హన్మకొండ ప్రాంతంలోని ప్రగతి నగర్, వివేక నగర్ కాలనీ ప్రాంతాల్లో కూడా ఏర్పడ్డ బురద వ్యర్థాలను తొలగించడానికి 3 జేసిబిలు, హిటాచీ యంత్రాలను వినియోగించి ట్రాక్టర్ ల ద్వారా చెత్తను తొలగిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, శానిటరీ సూపర్ వైజర్ లు గోల్కొండ శ్రీను, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


