పోలీసుల పక్షపాతాన్ని ఇక సహించం
ఎమ్మెల్యే ఒత్తిళ్లకు వంతపాడుతున్నారు
బీజేపీ కార్యకర్తలపై అణచివేత ధోరణి
సిరిసిల్ల సీఐపై వెంటనే చర్యలు తీసుకోవాలి
వేములవాడ అభివృద్ధి బాధ్యత నాదే
మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి బండి సంజయ్
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : వేములవాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తీరుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు పోలీసులు వంతపాడుతూ బీజేపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తిప్పాపూర్, నాంపల్లి, అంజనీ నగర్, మహంకాళి చౌరస్తా ప్రాంతాల్లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ సమావేశాల్లో పాల్గొన్న ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. ప్రశాంత ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటుంటే, పోలీసులు మాత్రం బీజేపీ అభ్యర్థుల నామినేషన్లకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే బెదిరింపులకు తలొగ్గి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ తీరును ఇకపై సహించేది లేదని స్పష్టం చేశారు.
“వేములవాడలోనే కూర్చుంటా”
సిరిసిల్ల పోలీసుల తీరుపై బండి సంజయ్ ఘాటు హెచ్చరికలు చేశారు. “పోలీసులారా… ఎన్నికలు శాంతియుతంగా జరగాలని లేదా? మా విజ్ఞప్తిని చేతగానితనంగా భావిస్తే ఊరుకునేది లేదు. అవసరమైతే వేములవాడలోనే కూర్చుంటా. డీజీపీ, ఎస్పీ ఇక్కడికే రావాల్సి ఉంటుంది” అంటూ హెచ్చరించారు.
బీజేపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరగడంలో సిరిసిల్ల సీఐ ఓవరాక్షన్ స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు. వెంటనే ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ హామీలు గాలికే!
రాష్ట్రంలో రెండేళ్ల కాంగ్రెస్ పాలన పూర్తిగా వైఫల్యమైందని బండి సంజయ్ ఆరోపించారు. మున్సిపాలిటీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నయాపైసా ఇవ్వలేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏవీ అమలు కాలేదని ప్రజల ముందే ప్రశ్నించారు. మహిళలకు రూ.2,500 ఆర్థికసాయం, తులం బంగారం, స్కూటీ, అవ్వాతాతలకు రూ.4 వేల పింఛన్, నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు – ఇవన్నీ ఏమయ్యాయని నిలదీశారు. హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ పాలన అవినీతిమయం
పదేళ్ల బీఆర్ఎస్ పాలన అంతా అవినీతి మయమైందని కేంద్ర మంత్రి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా కమీషన్ల కోసం దారి మళ్లించారని విమర్శించారు. ప్రజల సొమ్మును దోచుకున్న పార్టీగా బీఆర్ఎస్ చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. వేములవాడ మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే కేంద్రం నుంచి భారీగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. “నిధులిచ్చేది ప్రధాని మోదీ… తెచ్చేది నేను” అంటూ ప్రజల్లో విశ్వాసం కలిగించే ప్రయత్నం చేశారు.
14, 15వ ఆర్థిక సంఘ నిధులు, ఎంపీ ల్యాడ్స్, అమృత్ పథకం, స్వనిధి, విద్య–వైద్య రంగాలకు కేంద్రం అందించిన సహకారమే దేశాభివృద్ధికి నిదర్శనమని వివరించారు.
ఆలయ అభివృద్ధి పేరుతో మోసం
వేములవాడ ఆలయ అభివృద్ధి పేరుతో జరుగుతున్న పనులపై కూడా బండి సంజయ్ విమర్శలు చేశారు. సంప్రదాయాలను పక్కనపెట్టి రాతి నిర్మాణాల స్థానంలో సిమెంట్ కాంక్రీట్ పనులు చేపడుతున్నారని, ఇది భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చివరిగా, కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీల మోసపూరిత మాటలను నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 11న జరిగే పోలింగ్లో “పువ్వు” గుర్తుకు ఓటేసి వేములవాడ మున్సిపాలిటీని బీజేపీకి అప్పగించాలని కోరారు. అభివృద్ధి పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు.


