కాకతీయ, పెద్దపల్లి : పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, అభివృద్ధి కార్యక్రమాలతో పెద్దపల్లిని అగ్రగామిగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని ఆయన తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని నందన గార్డెన్స్‌లో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారుల చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే, స్థానిక తహసిల్దార్, నాయకులతో కలిసి 820 మంది సీఎంఆర్ఎఫ్, 133 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కు లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఆనందమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని,పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల సామర్థ్యంతో ఆధునీకరణ చేస్తూ కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని చెప్పారు.
ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకునే వారికి క్యాంపు కార్యాలయంలోనే అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు ఈర్ల స్వరూప, మినుపాల ప్రకాశ్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


