మల్లంపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం
: మంత్రి సీతక్క
మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
కాకతీయ, ములుగు ప్రతినిధి: మల్లంపల్లి గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. బుధవారం ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్.తో కలిసి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామైక్య సంఘ భవనానికి 10 లక్షలు, సీఆర్‌ఆర్ నిధులతో 72.50 లక్షలతో సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. అనంతరం ఉపాధి హామీ పథకం ద్వారా 20 లక్షలతో నిర్మించిన శ్రీనగర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
మండల అభివృద్ధికి ప్రణాళికలు
మల్లంపల్లిని ప్రత్యేక మండలంగా ప్రకటించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. మండల సముదాయ భవనాలు నిర్మిస్తూ ఎంపీడీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలను ఒకే చోట ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. గ్రామంలోని అంగడి స్థలాన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తామని తెలిపారు. త్వరలోనే పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి సిబ్బందిని నియమిస్తామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘ సభ్యులకు ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. అక్షరమాల కార్యక్రమం ద్వారా మహిళలు చదువుకోవడం అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా 18 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. సీఆర్‌ఆర్, ఎంఆర్ నిధులతో రోడ్ల పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, డీఆర్డీఓ శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్, అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ సునీత, మండల ప్రత్యేక అధికారి కృపాకర్, సర్పంచ్ శ్యామ్ రావు, ఎంపీఓ, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


