కాకతీయ, మంథని: మంథని ప్రాంతంలో విద్యా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యరంగ అభివృద్దికి సంపూర్ణ కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంథని మున్సిపాలిటీ పరిధిలో విస్తృత పర్యటన చేశారు.
ఈ సందర్బంగా మంత్రి 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్ సెంటర్‌కు శంకుస్థాపన చేసి, ఎంపీపీఎస్ బాలికల పాఠశాలలో టీచ్ ఫర్ చేంజ్ (మంచు లక్ష్మి ఫౌండేషన్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ మాట్లడుతూ.. పేదలకు నాణ్యమైన విద్య అందించడంలో టీచ్ ఫర్ చేంజ్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
నియోజకవర్గంలో 6 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన టీచ్ ఫర్ చేంజ్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. విద్య, వైద్య రంగాలలో స్పష్టమైన మార్పు తీసుకుని రావాలని ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యతో సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, విద్యార్థులు భవిష్యత్తులో నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, డిజిటల్ తరగతులు విద్యార్థుల బోధనలో మెరుగైన మార్పులు తీసుకువస్తాయని, ఉపాధ్యాయులు ఈ సదుపాయాలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 51 తరగతి గదులకు తమ సంస్థ ద్వారా డిజిటల్ సౌకర్యాలు కల్పించామన్నారు. తమ కుటుంబ నేపథ్యం విద్యా రంగంతో ముడిపడి ఉందని, నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరికీ అందించాలనే లక్ష్యంతోనే టీచ్ ఫర్ చేంజ్ సంస్థను స్థాపించామని తెలిపారు.
అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయంలో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేసి, రామగిరి, కమాన్‌పూర్ మండలాల్లో ఎంపికైన 205 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని సూచిస్తూ, ప్రతి సోమవారం నిర్మాణ పురోగతిని బట్టి నిధులు జమ చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నన్నయ గౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, మంథని మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వెంకన్న, ఆర్‌డీవో సురేష్, సహకార సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్, తహసిల్దార్, ఎంపీడీఓ, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


