ప్రజల విశ్వాసాన్ని నిలబెడతాం
: కరీంనగర్ మేయర్ కోలగని శ్రీనివాస్
66వ డివిజన్లో రూ.13.5 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం
ప్రతి వారం డివిజన్ పర్యటనకు హామీ
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర ప్రజలు బీజేపీపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టేందుకు కట్టుబడి పనిచేస్తామని మేయర్ కోలగని శ్రీనివాస్ తెలిపారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ నగరపాలక సంస్థను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి వారం ఒక రోజు డివిజన్లను సందర్శిస్తానని హామీ ఇచ్చారు. నగరంలోని 66వ డివిజన్లో రూ.13.5 లక్షల వ్యయంతో చేపట్టిన రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులను డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ వంగల పవన్‌తో కలిసి మేయర్ ప్రారంభించారు. నగర అభివృద్ధిలో ప్రజల సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని ప్రణాళికాబద్ధంగా పనులు చేపడతామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నగరాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని అన్నారు.
మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం
66వ డివిజన్‌తో పాటు కార్పొరేషన్లో విలీనమైన గ్రామాల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మేయర్ వెల్లడించారు. రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం, చెత్త సేకరణ వంటి అంశాల్లో మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని ఏ డివిజన్‌లోనూ తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు అవసరమైన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


