తొర్రూరు మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురేస్తాం
16 వార్డుల్లో ఒంటరిగానే బీజేపీ పోటీ
గెలుపే లక్ష్యంగా పక్కా వ్యూహం
బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్
కాకతీయ, తొర్రూరు : రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తొర్రూరు మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేసి బీజేపీ సత్తా చాటాలని బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ పిలుపునిచ్చారు. స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి బీజేపీ తొర్రూరు అర్బన్ అధ్యక్షుడు పైండ్ల రాజేష్ అధ్యక్షత వహించారు.
పొత్తుల్లేవు.. బీజేపీ ఒంటరి పోరు
సౌడ రమేష్ మాట్లాడుతూ… తొర్రూరు పట్టణంలోని 16 వార్డుల్లో బీజేపీ ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు పక్కా ప్రణాళికలతో ఎన్నికలకు సిద్ధమవుతున్నామన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో పట్టణంలోని ఐదు వార్డుల్లో అధికార పార్టీ కంటే ఎక్కువ ఓట్లు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. జనగామ జిల్లా ఇన్‌చార్జి కట్టా సుధాకర్ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి కార్యకర్తలు విభేదాలు పక్కనపెట్టి ఐక్యంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లేగా రాం మోహన్ రెడ్డి మాట్లాడుతూ… పాలకుర్తి నియోజకవర్గంలోని ఏకైక మున్సిపాలిటీ తొర్రూరేనని, అన్ని వార్డుల్లో పోటీ చేసి గెలుపే లక్ష్యంగా తాను ప్రత్యేకంగా ఇక్కడే ఉండి కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. అనంతరం గెలిచిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులను సన్మానించారు.


