తొర్రూరుపై గులాబీ జెండా ఎగురవేస్తాం!
16 వార్డుల్లోనూ బీఆర్ఎస్ గెలుపే లక్ష్యం
ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీమంత్రి ఎర్రబెల్లి దిశానిర్దేశం
గులాబీ గూటికి కాంగ్రెస్ సీనియర్ నేతలు
కాకతీయ, తొర్రూరు : త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు ముందే తొర్రూరులో రాజకీయ వేడి పెరిగింది. తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ, తొర్రూరు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దుబ్బతండ సమీపంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కాంగ్రెస్ ఎమ్మెల్యే అధికారం అండతో నిరుపేదలకు ఇవ్వకుండా కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పేదల కోసం నిర్మించిన ఇళ్లను రాజకీయ కక్షతో నిలిపివేయడం సరికాదన్నారు.
అభివృద్ధికి కారకుడు కేసీఆర్
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధిలో ముందంజలో ఉందంటే దానికి కారణం మాజీ సీఎం కేసీఆర్ అని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. తొర్రూరు మండలాన్ని మున్సిపాలిటీగా మార్చి, అభివృద్ధికి బాటలు వేసిన మహానీయుడు కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజలే బహిరంగంగా చర్చించుకుంటున్నారని, మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
16 వార్డులపై గులాబీ పట్టు
తొర్రూరు మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 16 వార్డులనూ బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గడపగడపకు పార్టీ బలోపేతం చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తొర్రూరు పట్టణ మాజీ ఎంపీటీసీ తూర్పాటి సుభద్ర–శంకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నమిళ్ళ విజయభాస్కర్, జాటోత్ వీరన్న, జాటోత్ వెంకన్నలు ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకుని స్వచ్ఛందంగా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల, పెద్దవంగర మండలాలకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలకు ముందే గులాబీ శిబిరంలో ఉత్సాహం వెల్లివిరుస్తోందని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.


