తొర్రూరు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేస్తాం
మున్సిపల్ ఎన్నికల్లో 16కి 16 వార్డులు గెలుస్తాం
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
కాకతీయ, తొర్రూరు : త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దుబ్బతండ సమీపంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను కాంగ్రెస్ ఎమ్మెల్యే అధికార అండతో నిరుపేదలకు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధికి బాటలు వేసినది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ప్రజలకు చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదని విమర్శించారు. మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో 16 వార్డులు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తూ, సమిష్టిగా కృషి చేసి తొర్రూరుపై గులాబీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు, పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల, పెద్దవంగర మండలాల నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


