రైతుల కష్టాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా…
మొంథా తుఫాను వల్ల రైతులకు అపార నష్టం
వరద ముంపు ప్రాంతాల సందర్శనలో పరకాల ఎమ్మెల్యే రేవూరి
కాకతీయ, గీసుగొండ: మొంథా తుఫాను ప్రభావంతో రైతులకు అపారమైన నష్టం కలిగిందని, రైతుల కష్టాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం ఆయన మండలంలోని టెక్స్టైల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో రాళ్లమ్మట్టు వాగు ఉధృతిని పరిశీలించారు.వాగు ఉప్పొంగడంతో టెక్స్టైల్ పార్కు రోడ్లు కోతకు గురైన దృశ్యాలను,వరద ప్రభావంతో నష్టపోయిన పంటలను ఎమ్మెల్యే ప్రత్యక్షంగా గమనించారు.టెక్స్టైల్ పార్క్ రోడ్లపై రైతులు ఆరబోసిన మొక్కజొన్న పంట తడిసి పాడైపోయిన దృశ్యాలు ఎమ్మెల్యేను కలచివేశాయి. మొంథా తుఫాను కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేయం,ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సహాయం అందేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గీసుగొండ తహసిల్దార్ ఎం.డి. రియాజుద్దీన్,సంగెం తహసిల్దార్ రాజు కుమార్, మండల వ్యవసాయ అధికారి పి. హరి ప్రసాద్ బాబు, గీసుగొండ సంగెం మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


