- అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో మా ప్యానల్ దే గెలుపు
- డిపాజిట్లు పెంచుతాం, 4 బ్రాంచులు ఏర్పాటు చేస్తాం
- భద్రతకు పెద్దపీట వేస్తాం
- ఆరోపణల్లో కురుకుపోయిన వారే మళ్లీ పోటీలో..
- కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ‘పార్లమెంట్’ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్, జగిత్యాల అర్బన్ బ్యాంకు ఖాతాదారులు, సభ్యుల సహకారంతో తమ ప్యానల్ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. తమ ప్యానెల్ అభ్యర్థులు మంచి అనుభవం, ఆశయం కలిగిన వారని, విజయం సాధించిన తర్వాత అర్బన్ బ్యాంకును అద్భుతంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా కొత్త మండలం వెలిచాల ప్రజా కార్యాలయంలో అర్బన్ బ్యాంకు ప్యానెల్ అభ్యర్థులతో కలిసి రాజేందర్ రావు మాట్లాడారు. ఆయన తమ ప్యానల్ అభ్యర్థులను ప్రకటించారు. అర్బన్ బ్యాంకు అభివృద్ధికి చేపట్టే ప్రణాళిక, గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారే మళ్లీ అధికారం కోసం తాపత్రయపడుతున్న అంశంతో పాటు పలు వివరాలను వెల్లడించారు.
ఎనిమిది సంవత్సరాలుగా కరీంనగర్ అర్బన్ బ్యాంకుకు ఎన్నికలు జరగలేదన్నారు. తమ ప్యానల్ అభ్యర్థులు గెలిచిన తర్వాత అర్బన్ బ్యాంకును పూర్తిస్థాయిలో సంస్కరిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం అర్బన్ బ్యాంకులో రూ.92 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని, తమ ప్యానల్ గెలిస్తే ఈ డిపాజిట్లను మూడింతలు అయ్యేలా చేస్తామన్నారు. హుస్నాబాద్, చొప్పదండి, హుజురాబాద్, జమ్మికుంటలో కొత్త బ్రాంచ్ లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీతో మొదటి నుంచి ముడిపడి ఉన్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి వారి వెంట ఉండి గెలిపించే బాధ్యత తాను తీసుకున్నానని రాజేందర్ రావు స్పష్టం చేశారు. ఖాతాదారులకు, సభ్యులకు భరోసా కల్పించేందుకు అద్భుతమైన మేనిఫెస్టోను రూపొందిస్తామని ప్యానల్ ఎంపికలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం ఉండే విధంగా చూశామని తెలిపారు.
గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో నుంచి వచ్చి ఒక ప్యానెల్గా ఏర్పాటు చేసుకొని ఓటర్ల ముందుకు వస్తున్నారన్నారు. గతంలో పనిచేసిన వారి తీరు బెరీజు వేసుకొని ఓటర్లు ఆలోచన చేయాలని సూచించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆ నియోజకవర్గ నుంచి మంచి ఆశయం, పట్టుదల ఉన్న ఇద్దరిని తమ ప్యానెల్ కు ప్రతిపాదించారన్నారు. అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో తమ ప్యానల్ కు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆశీర్వాదాలున్నాయని వెలిచాల తెలిపారు. శనివారం రాజేందర్ రావు హైదరాబాదులో మంత్రులు పొన్నం, తుమ్మలను, ప్రభుత్వ విప్ ను కలిసి కరీంనగర్ అర్బన్ బ్యాంక్ పానల్ డైరైక్టర్లను పరిచయం చేశానన్నారు. కార్యక్రమంలో అర్బన్ బ్యాంకు ప్యానల్ అభ్యర్థులు మూల వెంకటరవీందర్ రెడ్డి, ఈ.లక్ష్మణ్ రాజు, అనురాసు కుమార్, వజీర్ అహ్మద్, ఉయ్యాల ఆనందం, చిందం శ్రీనివాస్, నార్ల శ్రీనివాస్, గాదె కార్తీక్, కూసరి అనిల్ కుమార్, మన్నె అనంత రాజు, మునిఫల్లి ఫణిత, దామెర శ్రీలత రెడ్డి, కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ నాయక్, మాజీ కార్పొరేటర్ ఆర్ష మల్లేశం, కాంగ్రెస్ నాయకులు మీసాల శంకర్, అనంతుల రమేష్, బట్టు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


