కాకతీయ, తెలంగాణ బ్యూరో : వామన్ రావు.. నాగమణి న్యాయవాద దంపతుల హత్య కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు స్వాగతించారు. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వాల విచారణ సంస్థలపై పెరుగుతున్న ప్రజా అవిశ్వాసానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలన్న సుప్రీం కోర్టు నిర్ణయం, న్యాయం పట్ల విశ్వాసాన్ని మరింత బలపరుస్తుందని రాంచందర్ రావు అన్నారు. స్థానిక విచారణ సంస్థలు నిజాన్ని వెలికితీయడంలో విఫలమయ్యే భయం, సాక్ష్యాల మాయం, ఒత్తిళ్లతో కేసు బలహీనమయ్యే పరిస్థితులను ప్రజలు గమనించారని పేర్కొన్నారు.
భవిష్యత్తుకు గట్టి హెచ్చరిక కావాలి:
సీబీఐ విచారణ ద్వారా నిజానిజాలను వెలికితీసి, దోషులకు కఠిన శిక్షలు విధించాలని బిజెపి ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కేసు భవిష్యత్తులో ఇలాంటి దారుణాలకు పాల్పడే వారికి హెచ్చరికగా నిలవాలని అన్నారు. ఎంఎల్సీగా ఉన్న సమయంలోనే న్యాయవాదుల భద్రత కోసం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేకసార్లు డిమాండ్ చేశానని రాంచందర్ రావు గుర్తుచేశారు. ఈ అంశాన్ని శాసన మండలిలో పునరావృతంగా ప్రస్తావించినప్పటికీ అప్పటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని తెలిపారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ చట్టాన్ని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
బిజెపి పోరాటం కొనసాగుతుంది:
వామన్ రావు దంపతుల హత్యలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని రాంచందర్ రావు అన్నారు. న్యాయవాదుల భద్రత, గౌరవం కోసం బిజెపి పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.


