కక్ష సాధింపులు మానుకోవాలి
కేసీఆర్పై సిట్ విచారణకు బీఆర్ఎస్ నిరసన
పెద్దవంగరలో కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక
కాకతీయ, పెద్దవంగర : కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలను వెంటనే మానుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి *కేసీఆర్*పై సిట్ విచారణ పేరుతో అక్రమ అరెస్టుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆదివారం పెద్దవంగర మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీగా నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మాజీ సీఎం కేసీఆర్పై సిట్ విచారణ జరపడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు.
సిట్ విచారణ వెనక్కి తీసుకోవాలి
రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రతిపక్షాలపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని నాయకులు ఆరోపించారు. సిట్ విచారణను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామచంద్రయ్య శర్మ, సుదీర్ బాబు, సంజయ్, జ్ఞానేశ్వరచారి, దుంపల సమ్మయ్య, గంగాధర్, హరీష్, బిక్షపతి, సమ్మయ్య, నారాయణ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.


