- తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
కాకతీయ, కరీంనగర్ : జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో వర్షం వల్ల నష్టపోయిన పంట పొలాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. మెంథా తుఫాన్ రైతుల కళ్లలో కన్నీరు మిగిల్చిందని, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని గంగాడి కోరారు. చేతికి వచ్చిన పంట నీటిపాలైందని, అనేక ప్రాంతాల్లో పంట పొలాలు మునిగిపోయాయని, వడ్ల కుప్పలు వరద తాకిడికి కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వమూ రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. రైతుల సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో నవంబర్ 1న జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు.


