డ్రగ్స్‌పై యుద్ధం చేయాలి
మాదకద్రవ్య రహిత తెలంగాణ లక్ష్యం
మనమందరం సైనికులం.. అప్రమత్తంగా ఉండాలి
ఈగల్ ఫోర్స్ సీఐ వి విజయ్ రామ్ కుమార్
కాకతీయ, బోనకల్ : మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ సైనికుల్లా ముందుకు రావాలని ఈగల్ ఫోర్స్ ఖమ్మం జిల్లా సీఐ వి విజయ్ రామ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం బోనకల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈగల్ ఫోర్స్, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సర్పంచ్ బానోత్ జ్యోతి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. మోటమర్రి, ముష్టికుంట్ల, కలకోట గ్రామాల్లో కూడా సదస్సులు నిర్వహించారు. వి విజయ్ రామ్ కుమార్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు వందలాది జీవితాలను నాశనం చేస్తున్నాయని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై నిత్యం పర్యవేక్షణ ఉండాలని సూచించారు. డ్రగ్స్ వివిధ రూపాల్లో శరీరంలోకి చేరి తీవ్రమైన దుష్ప్రభావాలు చూపుతాయని తెలిపారు.
యువతపై తీవ్ర ప్రభావం
ఎస్సై పొదిలి వెంకన్న మాట్లాడుతూ, డ్రగ్స్ మన వర్తమానాన్ని దెబ్బతీసి భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరించారు. వ్యసనం కుటుంబాలను, సమాజాన్ని బలహీనపరుస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మండల తహసిల్దార్ మద్దెల రమాదేవి మాట్లాడుతూ, డ్రగ్స్ ఒక కుటుంబాన్నే కాదు సమాజాన్నే నాశనం చేస్తాయని తెలిపారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రీడా సామగ్రి పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రురావత్ రమాదేవి, మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య, సర్పంచ్ బానోత్ జ్యోతి, ఉప సర్పంచ్ బానోతు కొండ, మాజీ సర్పంచ్ కో వెంకటేశ్వర్లు, గుండపనేని సుధాకర్ రావు, నిమ్మతోట వెంకటలక్ష్మి, పంతంగి రమాదేవి, టి స్వర్ణ మారతమ్మ, అధికారులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


