- తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
- ఎకరానికి రూ.25 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్
- చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
కాకతీయ, కరీంనగర్ : మొంథా తుఫాన్ ప్రభావంతో చొప్పదండి నియోజకవర్గంలో పంటలు భారీగా దెబ్బతిన్నాయని, రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలతో వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిందన్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్వయంగా సివిల్ సప్లై మంత్రిగా ఉన్నా కనీసం ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహించకపోవడం విచారకరమని విమర్శించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో స్థానిక నాయకులు ప్రజలతో మమేకమై సమస్యలను అర్థం చేసుకుని చర్యలు తీసుకున్నారని, ప్రస్తుత ప్రజాప్రతినిధులు మాత్రం ప్రజల దరిదాపులకు రారని ఆవేదన వ్యక్తం చేశారు. చొప్పదండి నియోజకవర్గంలో 300 పైచిలుకు కొనుగోలు కేంద్రాలు ఉన్నప్పటికీ కేవలం 10–15 శాతం కేంద్రాలు మాత్రమే ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. రైతుల పంట నష్టాన్ని జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, తడిసిన ధాన్యాన్ని కటింగ్ లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు.వడ్లకు నల్లగింజలు, తేమ ఉన్నా మిల్లర్లు వెనక్కి పంపకుండా కొనుగోలు చేయాలని, అలాగే పత్తి రంగు మారినా సీసీఐ ద్వారా కొనుగోలు కొనసాగించాలని ఆయన కోరారు.


