- ములుగు అటవీశాఖ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా
కాకతీయ, ములుగు ప్రతినిధి : కోతుల బారి నుంచి ప్రజలను, పంట పొలాలను రక్షించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ములుగు జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం అటవీ శాఖ రేంజర్ శంకర్ కు ఆ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రత్నం రాజేందర్ మాట్లాడుతూ పది సంవత్సరాలుగా ములుగు జిల్లా వ్యాప్తంగా కోతుల బెడద తీవ్రంగా పెరిగిపోయిందన్నారు. గ్రామాల్లో ప్రజలు భయాందోళనలో జీవిస్తున్నారని, పంట పొలాలు, కూరగాయ తోటలు, పండ్ల చెట్లు అన్నింటినీ వానరాలు నాశనం చేస్తున్నాయని తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఇళ్లలో, పొలాల్లో కోతులు దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయన్నారు. రహదారులపై ప్రయాణించే వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని పేర్కొన్నారు.
అంతేగాక చిన్నారులు సైతం భయంతో టిఫిన్ బాక్సులు పట్టుకుని స్కూల్‌కి వెళ్లలేని పరిస్థితి నెలకొందని వారు వాపోయారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అటవీ, రెవెన్యూ, పంచాయతీ శాఖలు సంయుక్తంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కోతులను పట్టుకొని దట్టమైన అడవుల్లో వదిలివేయాలన్నారు. అలాగే కోతుల జనాభా నియంత్రణ కోసం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎమ్డీ గపూర్ పాషా, అలువాల ఐలయ్య, రత్నం ప్రవీణ్, కుర్ర రాజు, పసుల కోటయ్య, కలువల రవీందర్, రెడ్డి రామస్వామి, జన్ను దేవేందర్, బాలేశ్వర్, పల్లె నరసయ్య, చంటి తదితరులు పాల్గొన్నారు.


