పౌరులుగా బాధ్యతలు నిర్వర్తించాలి
ఖమ్మం కలెక్టర్ అనుదీప్
‘నా భారతదేశం–నా ఓటు’ థీమ్‌తో ఓటరు దినోత్సవం
నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ
కాకతీయ, ఖమ్మం : ప్రజాస్వామ్యంలో బాధ్యత గల పౌరులుగా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాలను తప్పకుండా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తామని, ఈ ఏడాది ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జనవరి 23న ఓటర్ ప్రతిజ్ఞ చేపట్టినట్లు తెలిపారు. దేశంలో కులం, మతం, భాష, ప్రాంతం, పేద–ధనిక భేదం లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన ఓటు హక్కు కల్పించబడిందని పేర్కొన్నారు. యువతతో సహా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, నిస్వార్థంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది ‘నా భారతదేశం–నా ఓటు’ అనే థీమ్‌తో ఓటరు దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో నమోదు కావాలని, కుటుంబ సభ్యుల పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. అనంతరం ఉద్యోగులతో కలిసి కలెక్టర్ ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



