- కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి
- కనీస మద్దతు ధర అందిస్తాం
- పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
కాకతీయ, రాయపర్తి/పాలకుర్తి : రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేసేందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. బుధవారం పాలకుర్తి మండలం తీగారం గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి రైతుకు కనీస మద్దతు ధర అందిస్తామని అన్నారు. రైతులు ధైర్యంగా ముందుకొచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, సన్న రకం వడ్లకు తప్పకుండ ఐదువందల బోనస్ అందిస్తామని స్పష్టం చేశారు. దళారుల మాయమాటలు నమ్మి పోసపోవద్దన్నారు. ధాన్యం విక్రయించడానికి వచ్చే రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.


