మేం గొప్పలు చెప్పుకోవడం లేదు
ప్రభుత్వ అభివృద్ధిని శ్రేణులకు ప్రజలకు వివరించాలి
కొన్ని పార్టీలు మూడు దశాబ్దాల క్రితం చేసినవి కూడా చెప్పుకుంటున్నాయి
కాంగ్రెస్ చేసిన పనులు చెబితే ఇంకో పార్టీకి భవిష్యత్తే ఉండదు
మధిర మున్సిపాలిటీలో గెలుపే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలి
రేపటి తరాల భవిష్యత్తు కోసమే మధిర అభివృద్ధి
క్లీన్ అండ్ గ్రీన్ నగరాన్ని కోరుకునే వారినే గెలిపించాలి
మధిర మున్సిపల్ కీలక నేతల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఇంకో పార్టీకి ఈ దేశంలో భవిష్యత్తే ఉండదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వ్యాఖ్యానించారు. ఇతర పార్టీలు రెండు మూడు దశాబ్దాల క్రితం చేసిన కొద్దిపాటి పనులను మైకు దొరికిన ప్రతిసారి చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటుంటే, కాంగ్రెస్ శ్రేణులు తమ ప్రభుత్వం చేస్తున్న గొప్ప పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వెనుకంజలో ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లిలో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.
మధిర మున్సిపాలిటీ గెలుపే లక్ష్యం
మధిర మున్సిపాలిటీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మధిర నగరానికి అందించిన రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను ప్రతి నాయకుడు రోజుకు కనీసం పదిమందికి వివరించగలిగితే చాలని సూచించారు.
మధిర పట్టణం క్లీన్ అండ్ గ్రీన్ నగరంగా మారితేనే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని అన్నారు. ఆ దిశగా ఆలోచించే, అభివృద్ధిని కోరుకునే వ్యక్తులనే ప్రజలు గెలిపించుకోవాలని సూచించారు. మధిర పట్టణానికి కాంగ్రెస్ చేయని అభివృద్ధి పని అంటూ ఏదీ లేదని స్పష్టం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ, చెరువులను టూరిజం పార్కులుగా అభివృద్ధి చేయడం, డిగ్రీ, ఇంటర్, హైస్కూల్ విద్యాసంస్థలకు సొంత భవనాలు, అగ్రికల్చర్ పాలిటెక్నిక్, జనరల్ పాలిటెక్నిక్, ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చడం, బస్టాండ్, ట్రెజరీ, బ్యాంకుల ఏర్పాటు వంటి అనేక కీలక అభివృద్ధి పనులు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని తెలిపారు.
డ్రైనేజీ పనులు పూర్తైతే నగర స్వరూపమే మారుతుంది
ఒక మంచి ఇల్లు కట్టే సమయంలో మొదట సిమెంట్, కంకర, ఇటుకలు చిందరవందరగా కనిపిస్తాయని, కానీ ఇల్లు పూర్తయిన తర్వాతే అందంగా కనిపిస్తుందని ఉపమానం చెప్పారు. అదే విధంగా ప్రస్తుతం జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయితే మధిర పట్టణం పూర్తిగా సుందరంగా మారుతుందని తెలిపారు. డ్రైనేజీ పనులు పూర్తయిన ప్రాంతాల్లో మట్టిని వెంటనే పూడ్చాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. డ్రైనేజీ పనులు పూర్తయిన అనంతరం మధిర నగరం అంతటా కొత్త సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. టాయిలెట్ల మురుగునీరు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు వెళ్లి శుద్ధి అనంతరం విడుదల అవుతుందని, వర్షపు నీటిని ఏట్లోకి మళ్లించేందుకు ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ ఉంటుందని వివరించారు. మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటేనే అభివృద్ధి పనులు కొనసాగుతాయని, పట్టణం అభివృద్ధి చెందితే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.


