30 వేల మెజార్టీతో గెలవబోతున్నాం..
బీఆర్ఎస్-బీజేపీది ఫెవికాల్ బంధం
కారు ఢిల్లీకి వెళ్లగానే కమలంగా మారుతోంది
కాళేశ్వరం కేసులో కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలి
ఫార్ములా ఈ రేసులో కేటీఆర్‌పై కేంద్రం చర్యలేవీ ?
సొంత చెల్లికి న్యాయం చేయనోడు ప్రజలకు ఏంచేస్తడు
నవీన్‌యాదవ్‌ను గెలిపిస్తే 4 వేల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా..
జూబ్లీహిల్స్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చేపిస్తా..
ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే 4 వేల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నవీన్ యాదవ్‌కు మద్దతుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ డివిజన్లో సీఎం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎస్‌పీఆర్ హిల్స్ నుంచి హబీబ్ ఫాతిమా నగర్ వరకు రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈసందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో 30 వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందని అన్నారు.
ఒక్కరికైనా రేషన్‌కార్డు ఇచ్చారా..
దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయారు. ఆయన సతీమణిని గెలిపించాలని భారత రాష్ట్ర సమితి కోరుతోంది. గతంలో పీ జనార్దన్ రెడ్డి చనిపోతే ఉప ఎన్నికల్లో కేసీఆర్ అభ్యర్థిని పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే వచ్చే ప్రతి ఉప ఎన్నికల్లోనూ కేసీఆర్ అభ్యర్థిని నిలిపారు. కేటీఆర్‌కు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి. ఇంటి నుంచి గెంటేశారని కవిత రాష్ట్రం మొత్తం తిరుగుతూ గోడు చెప్పుకుంటున్నారు. సొంత చెల్లికే న్యాయం చేయలేని కేటీఆర్ మీకు న్యాయం చేస్తారా..? బీఆర్ఎస్ హయాంలో ఒక్కరికైనా రేషన్ కార్డు ఇచ్చారా.. రెండేళ్ల పాలల్లో పాలనలో జూబ్లీహిల్స్ లో 14, 159 రేషన్ కార్డులు ఇచ్చాం.. బీఆర్ఎస్ గెలిస్తే మీకు వచ్చే పథకాలు అన్ని ఆగిపోతాయి.. అని రేవంత్ అన్నారు.
కాళేశ్వరంకేసులో చర్యలేవీ?
కాళేశ్వరం కేసును సీబీఐకి ఇస్తే 48 గంటల్లోనే కేసీఆర్, కేటీఆర్ ను జైలుకు పంపిస్తామన్నారు. సీబీఐకి అప్పగిస్తే మూడు నెలలైనా కేసు పెట్టలేదు. ఈనెల 11లోపు కాలేశ్వరం కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. బీజేపీ-బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం కాకపోతే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును అరెస్ట్ చేయాలి. వీళ్ళ అరెస్టులో భాజాపా చీకటి ఒప్పందం ఏంటి. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి కొరితే స్పందన లేదు. కేంద్ర హోం మంత్రిగా అమిత్‌షా ఉన్నారు కదా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు కానీ కసీఆర్ కేటీఆర్ పై మాత్రం చర్యలు లేవు. కారు ఢిల్లీకి వెళ్లగానే కమలంగా మారుతోంది అంటూ రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.
ప్రచారంలో పీసీసీ ఛీఫ్..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ జోరు పెంచింది. పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో సీఎంతోపాటు మంత్రులు, పీసీసీ ఛీప్, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి తదితరులు డోర్ టు డోర్ కాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఈక్రమంలోనే యూసఫ్‌గూడ మహమూద్ ఫంక్షన్ హాల్ లో డివిజన్ మైనార్టీ నేతలతో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమావేశం నిర్వహించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అజారుద్దీన్, ఏఐసిసి సెక్రెటరీ విశ్వనాథ్, సంపత్ కుమార్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, జయవీర్ రెడ్డి, శివసేన రెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి , నూతి శ్రీకాంత్ గౌడ్, వెలిచాల రాజేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
సీఎంను కలిసిన అజార్..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి అజారుద్దీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు ప్రభుత్వరంగ సంస్థలు, మైనార్టీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖలను కేటాయించిన నేపథ్యంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి దన్యవాదాలు తెలిపారు.



