పేదలకు సొంతింటి కల నెరవేర్చుతున్నాం
కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్
కాకతీయ, హుజూరాబాద్ /కమలాపూర్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నట్లు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తెలిపారు. శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారని పేర్కొన్నారు. శనివారం కమలాపూర్ మండలం భీంపల్లి, హుజూరాబాద్ మండలం బొత్తలపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ, నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతోందని చెప్పారు. ఇటీవల రాష్ట్ర బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్లకు నిధులు కేటాయించగా, ఏప్రిల్ చివరి వారంలోనే రెండో విడత ఇళ్ల కేటాయింపులు చేపడతామని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దశలవారీగా అందరికీ ఇళ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో భీంపల్లి, బొత్తలపల్లి గ్రామాల ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


