పదేళ్ల తప్పులు సరిదిద్దుతున్నాం!
కక్షసాధింపు అనడం సిగ్గుచేటు
ఇష్టమొచ్చినట్లు జిల్లాల విభజన బీఆర్ఎస్ పాపం
వరంగల్ విభజనపై బహిరంగ చర్చకు సిద్ధమా?
రెండేళ్లలోనే 61,379 ఉద్యోగాలు భర్తీ
మేడారంలో వందేళ్లు నిలిచేలా అభివృద్ధి
కండ్లుండి చూడలేని కబోదుల్లా బీఆర్ఎస్ నేతలు
హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల
కాకతీయ, హనుమకొండ : సంక్షేమం, అభివృద్ధితో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేస్తున్న ప్రజా ప్రభుత్వంపై ఓర్వలేని తనంతోనే ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ చేసిన వ్యాఖ్యలను శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఖండించారు. ప్రజా ప్రభుత్వాన్ని కక్షసాధింపు చర్యల పాలనగా అభివర్ణించడం సిగ్గుచేటని ఇనగాల విమర్శించారు. నిజంగా తమ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగితే బీఆర్ఎస్ నేతలంతా ఇప్పటికే జైళ్లలో ఉండేవారని వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. కండ్లముందే జరుగుతున్న అభివృద్ధిని చూడలేని కబోదుల్లా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండేళ్లలోనే ఉద్యోగ విప్లవం
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 61,379 ఉద్యోగాలు భర్తీ చేసిందని ఇనగాల గుర్తు చేశారు. ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటే, ‘ఇంటికో ఉద్యోగం’ అని చెప్పి పదేళ్లపాటు నిరుద్యోగులను మోసం చేసిన మాజీ సీఎం కేసీఆర్ ప్రతి నిరుద్యోగి ఇంటి ముందు ముక్కు నేలకు రాయాలన్నారు. ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని స్పష్టం చేశారు. జిల్లాల విభజనను బీఆర్ఎస్ ప్రభుత్వం అస్తవ్యస్తంగా, శాస్త్రీయత లేకుండా చేసిందని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆరోపించారు. ప్రజలే ఆ ఘన కార్యాన్ని తిరస్కరిస్తున్నారని, అందుకే జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. పాలనా సౌలభ్యం పేరుతో ఇష్టమొచ్చినట్లు జిల్లాలను విభజించిన మీరు ఇప్పుడు ప్రశ్నలు అడుగుతారా అని మండలి ప్రతిపక్ష నేత సిరికొండపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరంగల్‌ను రెండు జిల్లాలుగా చేసి ఒకే చోట హెడ్‌క్వార్టర్లు పెట్టడం ఏ పాలనా సౌలభ్యం కోసమో వరంగల్‌లో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
మేడారంలో వందేళ్ల అభివృద్ధి
మేడారం జాతర పనులు పూర్తికాలేదని విమర్శించే వారు అక్కడికి వెళ్లి చూడాలని ఇనగాల సూచించారు. మేడారం అభివృద్ధికి రూ.250 కోట్లు కేటాయించామని, అందులో రూ.150 కోట్లు నేరుగా జాతర ఏర్పాట్ల కోసమేనని తెలిపారు. చేపట్టిన పనులు ఇప్పటికే 95 శాతం పూర్తయ్యాయని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో పదేళ్ల పాటు మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. కేసీఆర్ సీఎంగా ఎన్ని సార్లు మేడారం వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మేడారాన్ని చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చేస్తున్నారని, జాతరకు మూడు నెలల ముందే సమీక్ష నిర్వహించిన తొలి సీఎం ఆయనేనని గుర్తు చేశారు. ఈ నెల 18న ఏకంగా మేడారంలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు.
ఆనాడు చేసిన కక్ష మరిచారా?
జర్నలిస్టులపై కేసులంటూ మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై కక్షసాధింపు చర్యలు చేపట్టిన విషయం మరిచారా అని ఇనగాల ప్రశ్నించారు. నమస్తే తెలంగాణ పత్రికను లాక్కోవడం, మోజో టీవీని కనుమరుగు చేసి జర్నలిస్టులను రోడ్డున పడేసిన చరిత్ర గుర్తులేదా అంటూ నిలదీశారు. తమకు నచ్చని, తమను ప్రశ్నించిన వారిని పదేళ్ల పాటు జైళ్లలో పెట్టిన బీఆర్ఎస్‌కు, ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కక్షసాధింపు ఆరోపణలు చేసే నైతిక హక్కు లేదన్నారు. ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై ఫొటో మార్ఫింగ్ కేసులు పెట్టింది ఎవరో ప్రజలు మర్చిపోలేదన్నారు. జర్నలిస్టులపై కేసులు ప్రభుత్వం పెట్టలేదని, ఐఏఎస్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే దాన్ని ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తేల్చిచెప్పారు.


