వర్షాల పట్ల అప్రమత్తంగా ఉన్నాం..
దసరా దృష్ట్యా ప్రజా రవాణాకు ఆటంకం కలగకుండా చర్యలు
మూసీ పరివాహక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
భారీ వర్షాలపై కలెక్టర్లు, ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల పట్ల అప్రమత్తంగా ఉన్నామని.. దసరా దృష్ట్యా ప్రజా రవాణాకు ఆటంకం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లతోపాటు సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. భారీ వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు మంత్రి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ జితేందర్‌తో కలిసి కలెక్టర్లు, ఎస్పీలు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గడిచిన 24 గంటల్లో భారీ వర్షాలు కురిసిన ప్రధానంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో చేపట్టాల్సిన చర్యలు, వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల్లో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఇరిగేషన్, రవాణా, విద్యుత్, హైడ్రా, జీహెచ్ఎంసీ, రెవెన్యూ విభాగాలు సమన్వయంతో పనిచేసి జనజీవనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో అతిపెద్ద పండుగైన దసరాకు ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి ప్రజలు సొంత గ్రామాలకు వెళతారని, వారి రవాణాకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయాలని సూచించారు.
సురక్షిత ప్రాంతాలకు తరలింపు
వికారాబాద్ జిల్లాలో కురిసిన అతిభారీ వర్షాల వల్ల మూసీ నదిలోకి భారీ వరద వస్తోందని, దీనిని దృష్టిలో పెట్టుకొని మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైనచోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే శివాజీ బ్రిడ్జి కింద భూలక్ష్మీ ఆలయం సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 55 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు వెల్లడించారు. మూసీ నదిలో నీటి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు నిరంతరం పర్యవేక్షణలోనే ఉండాలని సూచించారు.
షెల్టర్ హోమ్‌లను సిద్ధం చేసుకోవాలి
ముఖ్యంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు భారీ వరద వస్తున్నందున ముందు జాగ్రత్త చర్యగా వస్తున్న వరదను అంచనా వేసి అంతే పరిమాణంలో ఈ రెండు జలాశయాల నుంచి దిగువకు నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. రెండు జలాశయాల నుంచి నీటిని విడుదల చేసే సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైతే షెల్టర్ హోమ్‌లను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవాలి
ఇప్పటికే రాష్ట్రంలో చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండాయని, రాబోయే వర్షాల వల్ల చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి గారు సూచించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే లో-లెవెల్ కాజ్‌వేలు వద్ద ప్రమాదాలు జరగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జలాశయాలు, జల వనరుల వద్ద సెల్ఫీలు దిగకుండా యువతను నివారించాలని సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెస్క్యూ ఆపరేషన్ టీమ్‌లను, అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు.


