- వరంగల్ కు తప్పని వానగండం
- ఎప్పుడు వర్షం పడినా ఇదే గతి
- తప్పు ఎవరిదైనా తిప్పలు అందరికీ
- తుపాను ప్రభావంతో నగరం నలుదిక్కులు ముంపే
- వరద దాటనిదే వరంగల్ కు చేరుకోలేని దుస్థితి
- ముంపు నివారణ చర్యలు నేతల మాటలకే పరిమితం
- పరామర్శలు తప్ప ప్రత్యేక కార్యాచరణ శూన్యం

కాకతీయ, వరంగల్ : అందమైన ఓరుగల్లు.. వాన పడితే అందవిహీనం.. ఇదీ మహాచరిత్ర కలిగిన వరంగల్ మహానగరం దుస్థితి. వానాకాలం అనేకాదు.. ఎప్పుడు ఏ రూపంలో వర్షం పడినా నగరం ముంపునకు గురవుతూనే ఉంది. శాశ్వత పరిష్కారం మారుతున్న ప్రజాప్రతినిధులు, అధికారుల మాటలకే పరిమితమవుతోంది. ఈ ఏడాది వానాకాలం ముంపు నుంచి నగరం బయటపడిందనుకునే లోపే.. మొంథా తుపాను ప్రభావంతో మరోసారి ముంపును చవిచూడాల్సి వచ్చింది. బుధవారం పొద్దంతా కురిసిన ఏకధాటి వర్షంతో నగరం నలుదిక్కులా వరద పోటెత్తింది. గడిచిన 30ఏళ్లలో ఇదే పెద్ద ముంపు అనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.
యథా రాజా.. తథా ప్రజా..!

యథా రాజా.. తథా ప్రజా అనే సామెత నగరం ముంపు సమస్యకు అర్ధం చేకూర్చుతోంది. శిఖం భూములు, చెరువు స్థలాలు, నాలాలు ఆక్రమణలకు బడా నేతలు, వ్యాపారవేత్తలు, గల్లీ నాయకులు అండగా నిలుస్తున్నారనే వాదనలు నగర ప్రజల నుంచి వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయినా నేటికి మిగిలిన కొద్దిపాటి కుంటలు, చిన్నచిన్న మోరీలపైనా నిర్మాణాలు వెలుస్తూనే ఉన్నాయి. అడ్డుకోవాల్సిన అధికారులు బిక్కమొహం వేసుకుని అక్రమాలకు, ఆక్రమణదారులకు వంతపాడుతుండడంతో నగరానికి ముంపు సమస్య రోజురోజుకు తీవ్రమవుతూనే ఉంది. అధికారుల దాష్టీకానికి, నాయకుల దౌర్జన్యానికి ముంపు సమస్యను ప్రత్యక్షంగా ఎదుర్కొనే వారు వందల సంఖ్యలో ఉంటే… పరోక్షంగా ఇబ్బందులు పడే
వారు వేలల్లో ఉందడం గమనార్హం.
నగరం మధ్యలోనే మునక..!

నగరం మధ్యలోనే ప్రధాన చెరువులు ఉన్నాయి. భద్రకాళి చెరువు వరంగల్ నగరం నడిబొడ్డున వెలిసింది. హన్మకొండలోనూ ముంపు ప్రాంతాలు సైతం ఒకప్పటి పంట పొలాలు, శిఖం భూములని రికార్డులు తేటతెల్లం చేస్తున్నాయి. కాలక్రమేణా రికార్డులు మాసిపోయాయి. శిఖం భూములు ప్లాట్లుగా మారాయి. పంట పొలాలు నివాస స్థలాలుగా రూపుదిద్దుకున్నాయి. భద్రకాళి చెరువు శిఖం మొత్తం అపార్టుమెంట్లు వెలిశాయి. ఈ క్రమంలో వర్షపు నీరు చేరుకునే జలాశయాలు కుచించుకుపోవడంతో ఆ నీరంతా వరద రూపంలో శిఖం భూముల్లో వెలిసిన నివాసాలను ముంచెత్తుతోంది. ఆ వరద ఉదృతంగా మారి వీధుల్లోకి చేరి.. రహదారులను ముంచుతోంది. బుధవారం కురిసిన ఏకథాటి వర్షంతో కూడా అదే జరిగింది. నగరం నలుదిక్కులు వరదతో మూసుకుపోయాయి.
మాటలకే పరిమితం!
ముంపు సమస్య ఎదురైనప్పుడల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు కార్లలో దిగి.. తామున్నామంటూ ఆహార పొట్లాలు పంచడానికే పరిమితమవుతున్నారు. మళ్లీ వచ్చే ఏడాదికల్లా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారమంటూ ఊదరగొట్టి వెళ్తున్నారు. అనుకోకుండా వర్షాల వల్ల కలిగే అనర్థాలకు కాలం మీదే తప్పును నెట్టేసి.. మాటలతోనే మాయ చేస్తున్నారు.
మునగని ప్రాంతాలు ఇవే
నగరం మధ్యలో ఏర్పడే వరద ముంపు.. ఇతర ప్రాంతాలకు చుట్టుకుంటున్నదనేది వాస్తవం. అయితే, నగరంలో ఎలాంటి వర్షం పడినా ముంపునకు గురికాని ప్రాంతాలు కూడా ఉన్నాయి. నగరానికి ఎత్తు భాగంలో ఉన్న ఖిలావరంగల్ తూర్పు కోట ఇప్పటివరకు మునిగిన దాఖలాలు లేవు. వరంగల్ చౌరస్తాలో వరదనీరు పోటెత్తినా, అండర్ బ్రిడ్జి మునిగిపోయినా.. రామన్న పేటకు ఒకవైపు ముంపులో కూరుకున్నా.. కాశిబుగ్గ లోపలి ఏరియాలు నీటిలో తేలియాడినా.. భద్రకాళి శిఖం వైపు రహదారి మూసుకుపోయినా.. ఉరుసు గుట్ట పాత కరీమాబాద్, దేశాయిపేట, పాత కాశిబుగ్గ ప్రాంతం, వరంగల్ బస్టాండ్ ఏరియా.. చౌరస్తా నుంచి పోచమ్మ మైదాన్ ఏరియాలో మధ్యలో గల ప్రాంతం సురక్షితంగా ఉంటున్నాయి. ఈ ప్రాంతాల్లో చెరువులు గానీ, శిఖం భూములు గానీ లేకపోవడమే ఇందుకు కారణం కావచ్చు. అయితే, ముంపునకు గురయ్యే ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో ఈ ప్రాంతాలకు కాసింత ప్రమాదం పొంచి ఉంటుంది.
అధికారులు మారాలి.. పాలకులు పైరవీలు మానుకోవాలి..!
ఇప్పటికైనా అధికారులు మారాలి. శిఖం భూములు, పంటపొలాల్లో వెలిసిన ప్లాట్లకు అధికారులు అనుమతులు నిరాకరించాలి. నాలాలపై వెలిసిన నిర్మాణాలను నిర్మొహమాటంగా తొలగించాలి. తాజాగా శిఖం భూముల్లో చేపడుతున్న నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలి. ఇదే క్రమంలో నగరంలో డ్రైనేజీ వ్యవస్థను విస్త్రత పరచాలి. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఆక్రమణలకు వత్తాసు త్తాసు పలకడం మానుకోవాలి. పైరవీలు చేస్తూ ఉన్న కొద్దిపాటి కుంటలను అంతరించుకుపోయేలా చేయడానికి పూనుకోవద్దు. ప్రజలు కూడా శిఖం భూముల్లో సాగే నిర్మాణాలను అడ్డుకోవాలి. లేదంటే.. చారిత్రక వరంగల్ నగరం.. ఎప్పటికీ వానగండం నుంచి బయటపడదనే నగ్న సత్యాన్ని గుర్తించాలి.


