జల సంరక్షణతోనే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
మేయర్ కొలగాని శ్రీనివాస్
కాకతీయ, కరీంనగర్ : వేసవిలో భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో జల సంరక్షణపై ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక వైశ్య భవన్లో మానేరు పర్యావరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ జల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని అయన మాట్లాడారు. నీటి ఎద్దడి నివారణ ప్రజల చేతుల్లోనే ఉందని వర్షపు నీటిని వృథా కాకుండా ఒడిసిపట్టుకోవాలని సూచించారు. ప్రతి ఇంటిలో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, వ్యవసాయ భూముల్లో కూడా ఇవి ఉంటే సాగునీటి సమస్య తగ్గుతుందని తెలిపారు. పర్యావరణ సమితి అధ్యక్షుడు తోట లక్ష్మణరావు మాట్లాడుతూ ఎండిపోయిన బోర్ల చుట్టూ ఇంకుడు గుంతలు, గుట్టలు, బీడు భూముల్లో కాంటూరు కందకాలు త్రవ్వడం, గ్రామాల్లో వాగులపై వాటర్ షెడ్ నిర్మాణాలు చేపడితే భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. సర్వోదయ అధ్యక్షుడు పెద్ది లక్ష్మీనారాయణ కలుషిత నీటి వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, జలవనరులను రక్షించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పర్యావరణ సమితి సభ్యులు పాల్గొన్నారు.


