ఉండేనా ? ఊడేనా ?
డేంజర్ జోన్లో సురేఖ మంత్రి పదవి !
సమంత నుంచి సుమంత్ వరకు వరుస వివాదాలు
సహచర మంత్రి.. ఎమ్మెల్యేలతోనూ విభేదాలు
అనుచిత వ్యాఖ్యలతో కోర్టుల్లో కేసులు
ఇటీవల ముఖ్యమంత్రి పర్యటనకు సైతం దూరం
తాజాగా అగ్గిరాజేసిన మంత్రి ఓఎస్డీ తొలగింపు వ్యవహారం
సీఎం.. ఆయన కుటుంబంపై ఆమె కూతురు సంచలన ఆరోపణలు
మీనాక్షి నటరాజన్, మహేష్‌కుమార్ గౌడ్‌తో సురేఖ భేటీ
మంత్రివర్గ సమావేశానికి గైర్హాజర్..
తెలంగాణ కాంగ్రెస్‌లో కాకరేపుతున్న మంత్రి సురేఖ ఎపిసోడ్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : వరుస వివాదాలకు కేరాఫ్‌గా ఉన్న కొండా సురేఖ మంత్రి పదవి డేంజర్ జోన్లో పడినట్లు తెలుస్తోంది. మంత్రివర్గం నుంచి ఆమెను తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సురేఖ ఓఎస్డీపై వేటు, ముఖ్యమంత్రి, మంత్రులపై ఆమె కూతురు చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే సురేఖ వైఖరిపై అసంతృప్తితో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి ఆమె కుమార్తె చేసిన ఆరోపణలు మరింత అగ్గి రాజేసినట్లు అయ్యింది. గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్‌కు సైతం మంత్రి గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. ఈక్రమంలోనే ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ ఛీఫ్ మహేష్‌కుమార్ గౌడ్‌ను సురేఖ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఆమె మంత్రి పదవి ఉంటుందా ? ఊడుతుందా ? హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు జుబ్లిహిల్స్, స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళను కేబినెట్ నుంచి తప్పించే సాహసం సర్కార్ చేయబోదని.. దాని వల్ల చాలా పరిణామాలు, పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.
వరుస వివాదాలు
తెలంగాణ కేబినెట్లో కొండా సురేఖ తీరు మెుదటి నుంచి వివాదాస్పదమే.. విపక్షంతోపాటు స్వపక్షంలోని సహచర మంత్రులు, ఎమ్మెల్యేలతోనూ ఆమెకు విభేదాలే. ఇంకోవైపు కాంట్రవర్సీ కామెంట్స్‌లో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తొలుత అగ్రనటుడు అక్కినేని నాగార్జున, హీరోయిన్ సమంతపై అనుచిత వ్యాఖ్యలు చేసి కోర్టుల్లో కేసులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. ఆ తర్వాత ఒక ప్రైవేట్ పార్టీలో మద్యం గురించి మాట్లాడిన మాటలు సైతం వైరల్ అయ్యాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేడారం టెండర్ల విషయంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ ఇటీవల బహిరంగంగా చేసిన ఆరోపణలు పెను దుమారం రేపాయి.
పొంగులేటితో విభేదాలు ?
మేడారం, భద్రకాళి టెండర్ల విషయంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సురేఖకు వార్ నడుస్తోందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అందుకే ఇటీవల ఇన్చార్జి మంత్రి హోదాలో మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్ష జరగ్గా అందుకు దేవాదాయశాఖ మంత్రి అయిన కొండా సురేఖ గైర్హజరయ్యారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలకు సైతం కొండా సురేఖ దూరంగా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల కాలంలో మంత్రులు ఇష్టారీతిన వ్యవహరిస్తుండటం, ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేసుకోవడంతో దాని ప్రభావం అటు పాలన ఇటు ప్రభుత్వంపై పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈక్రమంలో మంత్రి సురేఖ వ్యవహార శైలిపైనా సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
కాకరేపిన సుస్మిత వ్యాఖ్యలు..
ఈ తరుణంలో మంత్రి కొండా సురేఖ తనయ సుస్మిత చేసిన వ్యాఖ్యలు పుండుమీద కారం చల్లినట్లు అయ్యింది. మంత్రి సురేఖ ఓఎస్డీ సుమంత్‌ను తొలగించిన విషయంలో కొండా సురేఖ కూతురు సుస్మిత అంతలా రియాక్ట్ అవ్వడంతోపాటు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులపైనా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు రోహిన్ రెడ్డిపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే రేవంత్ రెడ్డి సోదరులు కొండల్ రెడ్డి, తిరుపతిరెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఓఎస్డీని విధుల నుంచి తప్పించడంతోపాటు అతడిపై అనేక ఆరోపణలు ఉండటంతో విచారించేందుకు వెళ్లగా ఎందుకంతలా అడ్డుపడుతున్నారో అన్న అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
కేబినెట్ మీటింగ్‌కు గైర్హాజర్
మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షానికి అస్త్రం ఇచ్చినట్లేనని తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సమావేశాలకు సైతం మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం… మంత్రులతో పొసగకపోవడం…తన అనుచరులు, కుటుంబంపై విమర్శలు చేసిన వారిని కేబినెట్లో కొనసాగిస్తే సరికాదేమో అనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖను కేబినెట్లో కొనసాగిస్తే అసమ్మతికి తావిచ్చినట్లు అవుతుందేమోననే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి మల్లగుల్లాలుపడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశానికి సైతం మంత్రి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కొండా సురేఖ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది.
వేటు వేస్తే పరిణామాలేంటి ?
మరోవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బీసీల రిజర్వేషన్లపై పోరాటం చేస్తోంది. తెలంగాణలో కూడా 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకు దగ్గరవ్వవాలనే భావనలో ఉంది. ఇలాంటి తరుణంలో ఒక బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళను కేబినెట్ నుంచి తప్పిస్తే దాని నుంచి చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే రెడ్లు అంతా కలిసి బీసీ మహిళను అణగదొక్కాలని చూస్తున్నారని సుస్మిత ఆరోపణలు చేశారు. ఒకవేళ కేబినెట్ నుంచి కొండా సురేఖను తప్పిస్తే అదే నిజమవుతుంది. దాని వల్ల బీసీ సామాజిక వర్గాల్లో వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు, ఇంకోవైపు లోకల్ బాడీ ఎన్నికలు మంత్రి కొండా సురేఖపై తీసుకునే నిర్ణయంపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఈక్రమంలో కాంగ్రెస్ నాయకత్వం సురేఖ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది వేచి చూడాలి.
నా ఇబ్బందులన్నీ చెప్పా.. మంత్రి కొండా సురేఖ
తోటి మంత్రులతో వివాదం, తాజా పరిణామాలపై మంత్రి కొండా సురేఖ, కూతురు సుస్మితతో కలిసి ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో భేటీ అయ్యారు. సుమారు రెండున్నర గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ తనపై జరగుతోన్న కుట్రలను మీనాక్షి నటరాజన్ కు వివరించినట్లుగా తెలుస్తోంది. తనను, కుటుంబాన్ని, తన మనుషులను ఎవరెవరు ఎలా ఇబ్బందులు పెడుతున్నారో ఏకరువు పెట్టినట్లుగా సమాచారం. బీసీ మహిళలను అయిన తనను ఎన్ని కష్టాలకు గురి చేస్తున్నారో మీనాక్షికి వివరించి బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పి మంత్రి బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. భేటీ అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. తోటి మంత్రులతో తాను పడుతోన్న ఇబ్బందులు, ఆలోచనలు మీనాక్షి నటరాజన్ కు తెలిపానని అన్నారు. నా బాధలు అన్ని వారితో పంచుకున్నానని, వాళ్లు ఇచ్చిన ఆదేశాల మేరకు తాను ముందుకు వెళ్తానని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.
దొంతికి మంత్రి పదవి అంటూ ప్రచారం
మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తప్పిస్తారనే ఊహాగానాలు వెలువడుతున్న తరుణంలోనే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి కేబినెట్లో బెర్త్ ఖాయమైందంటూ ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టింగులు పెడ్తుండటం వరంగల్ జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో చర్చలు ముగిశాయయని, సీఎం రేవంత్ రెడ్డి , తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ సానుకూలంగా స్పందించారనే వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటారనే పేరు, నిత్యం ప్రజల్లో ఉండటం, కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ ప్రయాణం, స్వతంత్ర అభ్యర్థిగా 2014లో శాసన సభ్యుడిగా ఎన్నికై, ప్రలోభాలకు లొంగకుండా మాతృ పార్టీపై విధేయతతో దొంతికి మంత్రి పదవి వరించనుందని ఆయన అభిమానులు ప్రచారం చేస్తున్నారు.


