గుంతల మయంగా వరంగల్ -నర్సంపేట రోడ్డు
ఆర్అండ్ అధికారులకు కనబడటం లేదా అంటున్న జనం
కాకతీయ, గీసుగొండ : వరంగల్ – నరసంపేట ప్రధాన రహదారి పై ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. గీసుగొండ పరిధి లేబర్ కాలని హెచ్ పి పెట్రోల్ బంక్ ఎదురుగా నడి రోడ్డుపై ఏర్పడిన గుంతకు పోలీసులు బారికేడ్ ను అడ్డు పెట్టారంటే రోడ్డు ఎంత ప్రమాద కరంగా మారిందో అనడానికి అద్దం పడుతుంది. ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నప్పటికీ,ఆర్ అండ్ బి శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోక పోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి ఇంత దయనీయ స్థితిలో ఉండటాన్ని చూసి ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భద్రత కోసం అధికారులు వెంటనే గుంతలు పూడ్చి రహదారి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.


